High Court on MLA Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Petition: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే, సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది. వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈసీకి హైకోర్టు నిర్దేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి సహా ముందస్తు బెయిల్ పిటిషన్ లను జేసీ అస్మిత్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది.


పిన్నెల్లిని ఎన్నికల సంఘం అరెస్టు చేయాలని ఆదేశించడంతో పరారీలో ఉన్న ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఎన్నికలు జరిగిన మే 13న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి గురువారం (మే 23) ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిన్నెల్లి రామక్రిష్ణ తరపు న్యాయవాదులు ఈసీ తీరును తప్పుబడుతూ వాదనలు వినిపించారు.


హైకోర్టులో వాదనలు ఇవీ
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎక్స్ లో నారా లోకేశ్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారని.. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని పిన్నెల్లి లాయర్ వాదించారు. అసలు నోటీసులు ఇవ్వకుండా ఆయన్ను అరెస్టు చేయడానికి వెళ్లడం సరికాదని అన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా కరెక్టు కాదని వాదించారు. లోకేశ్ ఎక్స్ లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారని.. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసర్ చెప్పారని అన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా ఇవే అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేశ్ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశారని.. అది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా.. నోటీసు ఇవ్వొచ్చని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.