అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి ఊరట లభించలేదు. ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచించింది. 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. దీంతో ఢిల్లీలో ఉన్న సీఐడీ బృందం లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 


ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేరుస్తూ.. గత వారంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు  బెయిల్ ఇవ్వాలని లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకే సంబంధం లేదని కేవలం రాజకీయ కారణాలతోనే తన పేరును ఇరికించారని ఆరోపించారు.                
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌  పేరును గత వారంలో చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని నిందితులుగా సీఐడీ పేర్కొంది. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్‌, నారా లోకేష్‌, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.                        


ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ.  ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్‌ పేరును మెన్షన్‌ చేసింది ఏపీ సీఐడీ.  ఈ కేసులో ఇప్పటికే  నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ముందస్తు బెయిల్ పొందారు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో ఇవాళ జరగనుంది. 


లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ కొట్టేస్తున్నట్టు పేర్కొంది. ఈ వాదనల సందర్భంగా లోకేష్ కు 41(A) ప్రకారం నోటీసులు ఇస్తామని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది క్రితం నమోదైన కేసు కాబట్టి ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ సెక్షన్‌లు మార్చినట్లు కోర్టుకు తెలిపారు. ఒకవేళ లోకేష్ విచారణకు సహకరించక పోతే కోర్టు దృష్టికి తీసుకు వస్తామన్నారు. ఏజీ అందించిన వివరాలను నమోదు చేసుకున్న జడ్జి... అరెస్ట్‌పై ఆందోళన లేదు కాబట్టి ప్రస్తుతానికి విచారణ ముగిస్తున్నట్టు తెలిపారు. 


చంద్రబాబు అరెస్ట్‌తో లోకేశ్ తన యువగళం యాత్రను ఈ నెల 9వ తేదీన నిలుపుదల చేశారు. ఇప్పుడు లోకేశ్ పైన కేసులు నమోదు అవుతున్న సమయంలో సీఐడీ అడుగుల పైన ఉత్కంఠ పెరుగుతోంది. లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడైతే లోకేశ్ యాత్ర నిలిచిందో తిరిగి అక్కడ నుంచే శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నందున వాటి విచారణ పూర్తైన తర్వాత ప్రారంభిస్తే బాగుంటుందన్న సీనియర్ల సూచన మేరకు లోకేష్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.