జీపీఎస్‌పై కసరత్తు చేస్తున్న ఏపీ సర్కార్‌.. త్వరలోనే ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. పీఆర్‌సీ ఉద్యోగి కంట్రీబ్యూషన్‌ మినహా మిగిలిన అన్ని ప్రయోజనాలు ఇస్తామని చెప్తోంది. అయితే, జీపీఎస్‌లో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. దీనిపై అద్యయనం చేసిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కార్‌ చెప్తోంది. మరోవైపు... జీపీఎస్‌ను కొన్ని ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తే... మరికొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయితీ కొనసాగుతోంది.


జీపీఎస్‌పై ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌... 50శాతం పింఛన్‌ గ్యారంటీతో పాటు పలు ప్రయోజనాలు అందిస్తామని చెప్తోంది. అయితే, ఈ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాలు ఇచ్చే ప్రయోజనాలను తీసుకోవాలని అంటున్నాయి. మరికొన్ని ఉద్యోగ సంఘాల నేతలు జీపీఎస్‌ ప్రతిపాదనను వ్యతిరేకించాలని పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌.. ఉద్యోగులను నిలువునా ముంచేలా ఉందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు తమ జీవిత కాలంలో ప్రతి నెలా పొదుపు చేసిన 10 శాతంతోపాటు ప్రభుత్వం జమ చేసే వాటా మొత్తాన్ని తీసేసుకొని... 50 శాతం గ్యారంటీ పింఛన్‌ ఇస్తామంటోదని... లేదంటే 25శాతమే ఇస్తామంటోందని చెప్తున్నారు. ఈ లెక్కన సీపీఎస్‌ ఉద్యోగి రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవనేది వారి వాదన.


అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు సీఎం జగన్‌. ఆ హామీని నిలబెట్టుకోవాలని... పాత పింఛను పథకం ఓపీఎస్‌ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఓపీఎస్‌ అమలు కుదరదని తేల్చిచెప్పేసింది ఏపీ ప్రభుత్వం. ఆ స్థానంలో జీపీఎస్‌ను ప్రవేశపెట్టేందువకు కసరత్తు చేస్తోంది. 50శాతం గ్యారెంటీ పింఛన్‌తోపాటు పలు ప్రయోజనాలు అందిస్తామని చెప్తోంది. ఏపీ ఉద్యోగ సంఘాలతో జీపీఎస్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది. జీపీఎస్‌ విధానంలో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు మంత్రి బొత్స. వారు అడిగిన అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామన్నారు.


జీపీఎస్‌ విధానంలో 50శాతం పింఛన్‌ రావడం సంతోషకరమే అంటున్నారు ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు. జీపీఎస్‌కు తాము అంగీకరిస్తామన్నారు. అయితే... డ్రాఫ్ట్‌లో ఏ అంశాలు ఉన్నాయో తమకు స్పష్టత లేదన్నారు. ఓపీఎస్‌కు జీపీఎస్‌ దగ్గరగా ఉండటం వల్లే చర్చలకు వచ్చామన్నారు. కానీ.. జీపీఎస్‌లో ఉండి సీపీఎస్‌ డబ్బులు తీసుకుంటే పింఛను తగ్గుతుందని చెప్పారు. జీపీఎస్‌లో పీఆర్సీ అమలు కాదని... సీపీఎస్‌లో ఉండాలనుకుంటే ఉండొచ్చు... లేదంటే జీపీఎస్‌లో చేరొచ్చని చెప్పారు. జీతంలో 50శాతం డీఆర్‌ ఇస్తామంటున్నారని చెప్పారు బొమ్మరాజు. సీపీఎస్‌ ఉద్యోగి చనిపోతే వారి వాటా మొత్తం వెనక్కి ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని చెప్పారు. ఓపీఎస్‌ వారికి వస్తున్నవన్నీ సీపీఎస్‌ వారికి అమలు చేయాలని కోమన్నారు. దీనిపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారంటున్నారు.


జీపీఎస్ సమావేశంలో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వచ్చింది. బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు, బండి శ్రీనివాస‌రావు నాయకత్వం వహిస్తున్న ఉద్యోగ సంఘాలు జీపీఎస్‌ను అంగీకరిస్తే... జీపీఎస్‌ వద్దు ఓపీఎస్‌ మాత్రమే కావాలంటున్నాయి కొన్ని ఉద్యోగ సంఘాలు. జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్న వారిలో ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణతోపాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. జీపీఎస్‌పై మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశాన్ని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య బహిష్కరించింది.