AP Capital Amaravati News | అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి పనులు అట్టహాసంగా తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 12వ తేదీ నుంచి 15వ తేదీ లోపు అమరావతి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం తేదీ ఖరారు చేయనుందని అధికారులు తెలిపారు.
వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు..
గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల వైపు మొగ్గుచూపుగా, అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. దాంతో అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వము రుణాల కోసం ఏడిబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కోలతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం హామీతో దశలవారీగా అమరావతి నిర్మాణానికి 31 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. ఈ జనవరిలోనూ సి ఆర్ డి ఏ (CRDA), ఏడిసిఎల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా టెండర్ల ఖరారులో జాప్యం జరిగింది. ఎన్నికల కోడ్ ముగియడంతో టెండర్లు ఖరారు చేస్తున్నారు..
పనులకు పరిపాలన ఆమోదం తెలిపిన ప్రభుత్వం
రాజధాని అమరావతిలో 48 వేల కోట్లతో 73 పనులకు ఏపీ ప్రభుత్వం ఇదివరకే పరిపాలన ఆమోదం తెలిపింది. ఇందులో 40 వేల కోట్ల విలువచేసే 62 పనులకు టెండర్లు సైతం ఆహ్వానించారు. ఈ బిడ్లను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సీఆర్డీఏ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నారు. అనంతరం కాంట్రాక్టర్లతో ఒప్పందం జరగనుంది. అమరావతిలో మొత్తం 90 పనులు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీ ఆర్ డి ఏ అథారిటీ నిర్ణయించింది.
కొన్ని పనులకు మళ్ళీ టెండర్లు..అమరావతి కోసం పిలిచిన టెండర్లలో దాదాపుగా 4 పనులకు కనీసం ఒక్క బిడ్ కూడా రాలేదు. ఎన్జీవో క్వార్టర్లు, జీవో పనులకు పిలిచిన టెండర్లకు బిడ్ దాఖలు కాలేదని సమాచారం. దాంతో మరోసారి టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లలో మౌలిక వసతులు కల్పించే టెండర్ల గడువు మార్చ్ 5న ముగిసింది. బిల్డింగ్ లకు సంబంధించి పనుల టెండర్ల గడువు ఏడో తేదీన ముగిసింది. బిడ్లను ఓపెన్ చేసి అర్హతల పరిశీలన అనంతరం రెండో కమిటీకి పంపనన్నారు. అమరావతి ఐకానిక్ టవర్ బేస్మెంట్ పటిష్టతను పరిశీలించాక అధికారులు టెండర్లు ఆహ్వానించనున్నారు. అమరావతి పనులకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ప్రపోజల్ ను పిలిచారు. అన్నీ గమనిస్తే వారం రోజుల్లో అమరావతి నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టనుంది.