Free Bus Scheme in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం పెద్ద బాంబు పేల్చింది. ఇది కేవలం జిల్లాల్లో తిరిగే వారికే వర్తింప జేయాలని భావిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగేందుకు వీలు లేదన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇదే ఫైనల్ కాకపోయినప్పటికీ మంత్రి నోటి నుంచి మండలిలో వచ్చిన ప్రకటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన అనేక అంశాల్లో సూపర్ సిక్స్ కీలకమైంది. అందుకే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. డీఎస్సీ ప్రకటించింది. అన్నా క్యాంటీన్‌లను కూడా పునః ప్రారంభించింది. 

Also Read: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం

ఉగాది నాటికి మరికొన్ని పథకాలు మరికొన్ని పథకాలు అమలు చేయాలని కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం, రైతులకు ఇచ్చే భరోసా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ముఖ్యమైనవి. వీటిలో మొదటి రెండింటిపై క్లారిటీ ప్రభుత్వం ఇస్తోంది. త్వరలోనే విధి విధానాలు విడుదల చేయనుంది. ఆ రెండు పథకాలను మే నెల నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

మరో ముఖ్యమైన పథకం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం. ఈ పథకం అమలు చేయడానికి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు, మంత్రులు పరిశీలించారు. అక్కడ పథకం అమలు అవుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేశారు. అన్నింటిపై సమగ్ర అవగాహన తెచ్చుకున్న ప్రభుత్వం ఈ పథకం స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. 

అందుకే రోడ్డు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్ ప్రయాణంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ ఉచిత బస్ ప్రయాణం ప్రజలకు కచ్చితంగా అందిస్తామని అన్నారు. అయితే ఇది ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా తిరిగేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. 

దీనిపై టీడీపీ శ్రేణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్ ప్రయాణం పథకంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలు కల్పించారని అన్నారు.ఏపీలో మాత్రం ఇలా చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని అవకాశంగా మలుచుకుంటాయని అంటున్నారు..

Also Read: టీడీపీ నేతల మదిలో మాట సెటైర్లతో చెప్పిన వెంకయ్య- ఇకనైనా చంద్రబాబు పంథా మారుతుందా?

వైసీపీ అప్పుడే ఉచిత బస్ ప్రయాణంపై సెటైర్లు మొదలు పెట్టేసింది. ఎన్నికల ముందు రయ్ రయ్ అని కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నై నై అంటున్నారని విమర్శలు చేస్తోంది.