విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం చెల్లింపులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 7న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం మేరకు చెల్లింపులు మొదలయ్యాయి. ఏపీ జి ఎల్ ఐ క్లెయిమ్ ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. జీపీఎఫ్ బిల్లులను క్లియర్ చేస్తోంది ఆర్థిక శాఖ. దాదాపు 3 వేల కోట్లు నెలాఖరులోపు చెల్లిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది. సమావేశం నిర్ణయం మేరకు ఉద్యోగులకు చెల్లింపులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం చెల్లింపులు ప్రారంభించడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెక్రెటరీ జనరల్ అరవ పాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చర్చ జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని అన్నారు. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నామని చెప్పారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని,ఆ ప్రభావం ఏపీ మీద పడిందని చెప్పారు.ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమని చెప్పారు. వీలైనంత వరకు సమస్య పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నామని అన్నారు. ఇవాళ చర్చలకు పెద్ద ప్రాధాన్యత లేదని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగుల పక్షమని వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ఆర్థిక పరమైన అంశాలపై చర్చించినట్లు సజ్జల తెలిపారు.
పెండింగ్ క్లైమ్స్ క్లియర్ చేస్తాం- మంత్రి ఆదిమూలపు
ఉద్యోగుల పెండింగ్ క్లైమ్స్ అన్ని క్లియర్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. జీపీఎఫ్ ఇతర పెండింగ్ బిల్లులు అన్ని ఈ నెలాఖరులోగా పరిష్కారం అవుతాయన్నారు. పెండింగ్ బిల్లులు..అదనంగా టీఏ ఇతర బిల్లులు కూడా చెల్లిస్తామని, జీవోఎం దృష్టికి తీసుకువచ్చిన అంశాలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు.
ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఇవాళ్టి నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఏపీ జేఏసీ అమరావతి. ఇప్పటికే జిల్లాలవారీగా ఉద్యమం కొరకు ఉద్యోగులను సన్నద్ధం చేశారు జేఏసీ నేతలు. అయితే మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రభుత్వం చాలా అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఈ నెలాఖరుకల్లా సుమారు 3 వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు సబ్ కమిటీ ఒప్పుకుంది. అయితే కమిటీ నుంచి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలనేది అమరావతి ఉద్యోగుల జేఏసీ డిమాండ్. లిఖితపూర్వకంగా హామీ వచ్చే వరకూ ఉద్యమం తప్పదని ప్రకటించారు జేఏసీ నేతలు.
కీలకంగా సీఎస్ నిర్ణయం..
బుధవారం సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు జేఏసీ నేతలు. సబ్ కమిటీ హామీలపై రాతపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ను కోరినట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు చెప్పారు. దీనికి సీఎస్ అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఉద్యమంపై చర్చించేందుకు గురువారం అత్యవసరంగా ఈసీ సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ జేఏసీ అమరావతి. ఈ సమావేశంలో ఉద్యమం కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ బొప్పరాజు చెప్పారు.