ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణారాహిత్య వ్యాఖ్యలు చేసినందుకు ఏబీపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. 1969 ఆలిండియా సర్వీస్ రూల్ 3, సబ్ రూల్ 3 ప్రకారం సస్పెన్షన్ వేటు వేసినట్టు అందులో తెలిపారు. నేరపూరిత దుష్ర్పవర్తనకు పాల్పడినందుకు సస్పెండ్ చేసిన ప్రభుత్వం వివరించింది. గతంలో కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు. కోర్టులో విజయం సాధించి పోస్టింగ్‌ తెచ్చుకొని ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు ఏబీ వెంకటేశ్వరరావు. 


1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. అప్పుడు రూల్స్‌ అతిక్రమించారన్న ఆరోపణలతో జగన్ సర్కారు ఆ మధ్య సస్పెండ్‌ చేసింది. తనపై తీసుకున్న చర్యలను తప్పుబడుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందు క్యాట్‌లో పిటిషన్‌ వీగిపోవడంతో హైకోర్టుకెళ్లారు. అక్కడ విజయం సాధించారు. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విషయాన్ని ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. 


ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు సస్పెన్షన్ ముగిసినట్టేనని.. జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పోస్టింగ్ ఇచ్చింది. జూన్ 14నే ప్రభుత్వం ఏపీ ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా ఏబీని నియమించింది. మే 19వ తేదీ నుంచి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నామని సీఎస్‌ సమీర్‌ శర్మ అబ్‌స్ట్రాక్ట్‌ ఇచ్చారు. తర్వాత ఆయన విధుల్లో జాయిన్ అయ్యారు. 


నిన్న కర్నూలులోని ప్రింటింగ్‌ ప్రెస్‌ను సందర్శించిన ఆయన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని వెల్లడించారు. ఇంతలోనే ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.