ఏపీలో ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్దుల‌కు ట్యాబ్‌లు ఇవ్వాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. సెప్టెంబరులో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని అనుకుంటున్న ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై సీఎం జగన్‌ స‌మీక్ష నిర్వ‌హించారు. తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణకు జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.


బై జూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తాం. ఆ ట్యాబ్ లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలి. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే 9, 10 తరగతుల్లో కూడా పని చేయాలి. మూడేళ్లపాటు ట్యాబ్‌ నాణ్యతతో పని చేయాలి. నిర్వహణ అంత్యంత ముఖ్యంగా భావించాలి. ఏదైనా సమస్య వస్తే, వెంటనే ట్యాబ్ రిపేరు చేసే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.






నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం జగన్. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించాలని తెలిపారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామని అధికారులు సీఎంకు వివ‌రించారు.


ప్రతి తరగతి గదిలోనూ టీవీ, డిజిటల్‌ స్కీన్‌ ఉండేలా చూడాలన్న సీఎం... తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు, వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయని వివ‌రించారు. వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని, స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుందని సీఎం సూచించారు. డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలన్న సీఎం, దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు.