Amaravati JAC Chairman Bopparaju venkateswarlu About GPS:
జీపీఎస్ పై అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. సీపీఎస్ కన్నా జీపీఎస్ మెరుగ్గా ఉంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని బొప్పరాజు తెలిపారు. ఎవరైనా సిబ్బంది గానీ, ఉద్యోగులు గానీ ఉద్యమం చేయడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కాదు అని, కేవలం సమస్యల పరిష్కారం కోసం ఎంచుకున్న మార్గమన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు ఎప్పటికీ వేరు వేరు కాదన్నారు. 36 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిందని, అందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. సమస్యల పోరాటానికి ఉద్యమం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేయడం సరికాదన్నారు.


ఏపీ ఉద్యోగుల సంక్షేమం కోసం 92 రోజుల పాటు ఉద్యమం చేసి సక్సెస్ అయిన సందర్భంగా ఉద్యమ నేతలకు అభినందన సభ విశాఖపట్నం జిల్లాలో నిర్వహించిన సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు జీపీఎస్ విధానంపై మాట్లాడారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ 60 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేరుస్తుందో చూస్తామన్నారు. మూడు నెలల పాటు కొనసాగించిన ఉద్యమంలో తాము ఎక్కడ లొంగిపోయాయో, ఎక్కడ అమ్ముడుపోయామో చెప్పాలని ప్రశ్నించారు. 


రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న జీపీఎస్ విధానంలో పాత ఫించన్ (సీపీఎస్) విధానానికి సమానంగా 50 శాతం పింఛన్, డీఆర్‌ను ఇస్తామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారని బొప్పరాజు ఇటీవల వెల్లడించారు. పాత పింఛన్ విధానం కంటే మెరుగైన ఫలితాలు ఉద్యోగులకు లభిస్తాయని చెప్పడాన్ని ప్రస్తుతానికి నమ్ముతామన్నారు.  జీపీఎస్ 80 శాతం వరకు పాత పింఛన్ (సీపీఎస్) కు దగ్గరగా ఉంది. కానీ జీపీఎస్ విధానంలో పీఆర్సీ అరియర్స్ ఒకటి వస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం వాడుకున్న తము డబ్బును తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఆప్కాస్ కింద పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తించాలని కోరడంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.


రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందా...? 
రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  చెప్పడం దారుణం అనడం తెలిసిందే. కాకినాడలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రతీ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు.  ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామన్నారు.