AP Education Minister Nara Lokesh reviews Education Department | అమరావతి: ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పారదర్శక విధానాలను మళ్లీ అమలు చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శనివారం (జూన్ 15న) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులను సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.


మధ్యాహ్న భోజనంపై ఆరా 
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులను ఆయన ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meals) డైరెక్టర్ అంబేద్కర్ కు సూచించారు. స్కూళ్లలో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధిత విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.


విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌పై ఫోకస్ 
2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని మంత్రి లోకేష్ ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన విద్యార్థుల జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు సైతం సమర్పించాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు స్కూల్ ఎంత దూరంలో ఉందనే వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూసివేశారు, అందుకు కారణాలు తెలపాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ పై సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను నారా లోకేష్ ఆదేశించారు. 


సీబీఎస్ఈ స్కూల్స్ మీద నివేదికకు ఆదేశాలు 
వైసీసీ హయాంలో బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బి వినియోగంపై సమగ్ర నోట్ ను సమర్పించాలని అధికారులకు ఆయన సూచించారు. సీబీఎస్ఈ స్కూల్స్ మీద నివేదికతో పాటు ఈ అకడమిక్ ఇయర్ లో పదో తరగతి పరీక్షలు రాసే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. ఈ ఏడాది విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో రిపోర్ట్ ఇవ్వాలని  మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ (Student Kit)ను ఈ నెలాఖరులోగా అందజేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడంపై లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని, తక్షణమే టెక్ట్స్ బుక్స్ పంపిణీ కి ఏర్పాటు చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.


గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునేలా ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, తదితరులు పాల్గొన్నారు.