ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కొరడా ఝుళిపించింది. ఈ స్కామ్ కేసులో పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఓ కంపెనీకి భారీ పెనాల్టీ విధించింది. ఫాస్ట్ లేన్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఏకంగా రూ.34.01 కోట్ల పెనాల్టీని డీఆర్ఐ విధించింది. జీఎస్టీ నిబంధనలను పట్టించుకోకుండా కొన్ని కంపెనీలు అవతవకలకు పాల్పడ్డాయని డీఆర్ఐ ఆరోపించింది.
కొనుగోలుదారుల నుంచి జీఎస్టీ సేకరించి ప్రభుత్వానికి సదరు కంపెనీ చెల్లించాల్సి ఉందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నిబంధనలు పాటించలేదని డీఆర్ఐ ఆరోపించింది. దీనికి సంబంధించి తాము ఆధారాలను పరిశీలించగా, రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టుగా తేలిందని తాము గుర్తించినట్లుగా అధికారులు చెప్పారు. ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఫాస్ట్ లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ అని గుర్తించామని అన్నారు.
ఏపీ ఫైబర్‌నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే అని, విచారణలో ఫాస్ట్ లేన్ మాజీ ఎండీ విప్లవ్ కుమార్ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నట్లుగా అధికారులు చెప్పారు. నిధులన్నీ షెల్ కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు ఒప్పుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ అని.. టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్ లేన్‌ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్‌కు ముందస్తు బెయిల్ వచ్చింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరిస్కరించింది. సుప్రీం కోర్టులో డిసెంబర్ 12న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.
2020 ఏడాదిలో సెప్టెంబర్ నెల నుంచి ఫాస్ట్ లేన్ కార్యకలపాలు నిలిపివేయడంతో.. ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్ లేన్ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.