ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవసరం అయిన మేరకు నియామకాలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష...
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్రమం తప్పకుండా ఆడిట్‌ చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రినీ ఒక యూనిట్‌గా తీసుకుని ఆడిటింగ్ చేయాలని ఆయన అన్నారు. విలేజ్‌ క్లినిక్‌ నుంచి బోధనాసుపత్రి వరకూ ఆడిట్‌ నిర్వహించాలని చెప్పారు. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు.. ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్న గుర్తించి వెంటనే భర్తీచేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


సరిపడా సిబ్బంది ఉంటే  సమస్యలు కూడా వాతంటత అవే పరిష్కారం అవుతాయని అన్నారు. దీంతోపాటు మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్ పై అధికారుల నివేదిక..
కోవిడ్‌ తాజా పరిస్థితుల పై ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందన్న అధికారులు, గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందని అధికారులు వివరించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని చెప్పారు. వీరంతా కోలుకుంటున్నారని అన్నారు.
పకడ్బందీగా ఫ్యామిలీ డాక్టర్ పనితీరు..
ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత వైద్యుడు ఏం చేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్‌ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలు అందించటం అభినందనీయమన్నారు.10,032 గ్రామాల్లో వైద్య సేవలు అందించిన ఫ్యామిలీ డాక్టర్‌,డయాబెటిక్‌ మరియు హైపర్‌ టెన్షన్‌... రెండింటితో బాధపడుతున్న వారు 4,43,232 మంది ఉన్నట్టు గుర్తించారని అన్నారు. హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న వారు 4,86,903 మంది, మధుమేహంతో 2,70,818 మంది బాధపడుతున్న వారు ఉన్నారని, వారికి వైద్యం, మందులు ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా అందచేయాలన్నారు.
ఓరల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న 4,649 మంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న 1761, సెర్వికల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న 7042 మందికి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న విషయాన్ని ముందుగానే తేదీలను ప్రకటించాలని సీఎం జగన్ అన్నారు.ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్‌ వద్దకు వచ్చి వైద్యం పొందేందుకు వీలుంటుందని సీఎం అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి జిల్లాల్లో సమర్థులైన అధికారులు ఉండేలా చూసుకోవాలన్నారు.
నూతన కళాశాలలపై సీఎం ఆరా..
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు,  సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సీఎం ఆరా తీశారు. కొత్త మెడికల్‌ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్న అధికారులు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్‌ సీట్లకు ఇవి అదనంగా తొడవటంతో ఇబ్బందులు ఉండే అవకాశం లేదని అన్నారు. ఈ విద్యా సంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని, అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్‌ సీట్లు  అందుబాటులోకి రానున్నాయని, 2025–26 విద్యాసంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం మెడికల్‌ కాలేజీల్లో తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నట్లు అధికారులు సీఎంకు వివరాలు అందించారు.