AP CID Notices to Gouthu Sireesha: టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు (Gouthu Sireesha) ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ చేసుకుంది. తొలుత ఆమెకు ఇచ్చిన నోటీసులో మంగళగిరి సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో విచారణకు రావాలని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల్లో ఉన్న ప్రకారమే మంగళగిరి సీఐడీ కార్యాలయంలో హాజరు అయ్యేందుకు గౌతు శిరీష వచ్చారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి శిరీష బయలుదేరారు. ఆమె అక్కడికి చేరుకోగానే, సీఐడీ అధికారుల నుండి శిరీష కు ఫోన్ వచ్చింది.


‘మంగళగిరి కార్యాలయం కాదు గుంటూరు సీఐడీ ఆఫీసుకు రండి’ అని సీఐడీ అధికారులు కోరారు. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు శిరీష హాజరైన సందర్భంగా ఆమెకు మద్దతుగా పదుల సంఖ్యలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో గౌతు శిరీష్ గుంటూరుకు బయలుదేరారు.


గతంలో తమపై అసహ్యకరమైన పోస్టులు వైసీపీ నాయకులు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గౌతు శిరీష ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం జగన్ ఆదేశాలపై తనపై ఆఘమేఘాలమీద కేసు కట్టి విచారణ పేరుతో పోలీసులు స్థలాలు మార్చి వేధింపులకు గురి‌చేస్తున్నారని శిరీష ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నాయకురాలిని వేధిస్తారా అంటూ పోలీసులపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు శిరీషను పంపేదాక ఆమె వెంటే ఉంటానని దేవినేని ఉమా స్పష్టం చేశారు.


సీఐడీ నోటీసులు ఎందుకంటే?
ప్రభుత్వం ఆర్థిక సమస్యల వల్ల అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నట్లు, 2022 సంవత్సరానికి గాను ఈ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్  వైరల్ అయింది. అయితే ప్రభుత్వ చిహ్నంతో ఇలా తప్పుడు పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారంటూ టీడీపీ నాయకురాలు గౌతు శిరీష (Gouthu Sirisha) కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది.  


గత శనివారం రాత్రి 10 గంటల సమయంలో గౌతు శిరీష, ఆమె తండ్రి, మాజీ మంత్రి గౌతు శివాజీని ఏపీ సీఐడీ అధికారులు కలిశారు. వచ్చే సోమవారం (జూన్ 6వ తేదీన) ఉదయం 10 గంటలకు మంగళగిరిలోకి సీఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద శిరీషకు నోటీసులు అందించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ వాహనమిత్ర, అమ్మఒడి రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పై గత నెల (మే 30న) చివర్లో సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 


ఈ క్రమంలో అప్పటికే అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడిని సీఐడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాజాగా గౌతు శిరీషను కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా  నోటీసులు జారీ చేశారు.