అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు మాట తప్పిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడ నిరసనపై పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్త పీఆర్సీపై తొలిసారిగా స్పందించిన పవన్.. ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ మాట తప్పి మడమ తిప్పిందన్నారు. అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడం మోసపూరిత చర్య అని పవన్ అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి కానీ అందుకు విరుద్దంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. మండుటెండలో నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని పవన్ అన్నారు. 


ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఉద్యోగి పీఆర్సీసీ ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు... అందుకు అనుగుణంగా పిల్లల చదువుల ఖర్చు, ఇతర ఖర్చులకు ఒక బడ్జెట్ వేసుకుంటారన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల బాధలు తెలుసన్న పవన్... ఈ రోజున వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గించారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అన్నారని, ఇప్పుడు అడిగితే అప్పుడు తగిన అవగాహన లేకుండా చెప్పామని అంటున్నారని పవన్ ఆరోపించారు. 


చర్చల పేరుతో అవమానిస్తారా..?
'వివిధ శ్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏను రెండు శ్లాబులకు కుదించడం వల్లే ఒక్కొక్కరికీ రూ.5 వేలు నుంచి రూ. 8 వేలు వరకు జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగులు పలుమార్లు చెప్పినా మంత్రులు, అధికారులు పట్టించుకోకపోవడం, చర్చలకు పిలిచి అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించడం, అవమానించేలా మాట్లాడం వల్లే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లు మీదకు వచ్చారు. ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి అవమానించారు. ఉద్యోగుల నిరసనకు కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల కష్టాలు నాకు బాగా తెలుసు. దీని గురించి ముందే స్పందిద్దామని అనుకున్నాను కానీ, ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయదలుచుకోలేదని చెప్పడంతో ఒక అడుగు వెనక్కి తగ్గాను. ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రం కచ్చితంగా మద్దతు ఇవ్వాలని మా పార్టీ నాయకులకు కూడా చెప్పాను. జనసేన నాయకులకు, శ్రేణులకు, జన సైనికులకు కూడా చెబుతున్నాం. ఉద్యోగులకు మద్దతుగా ఉండాలి' అని పవన్ కల్యాణ్ అన్నారు. 


ఉద్యమానికి జనసేన పూర్తి మద్దతు


వైసీపీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు సన్నద్ధం అవుతున్నాని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్చలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగులను అవమానించేలా, రెచ్చెగొట్టేలా మాట్లాడకూడదన్నారు. వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు.