AP Excise Grant of Permit Rooms | అమరావతి: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో పర్మిట్ రూమ్‌లకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 273కి అనుమతించింది. పర్మిట్ రూమ్‌లకు సంబంధించి నియమ నిబంధనలను తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్మిట్ రూములు అందుబాటులో లేకపోవడం వల్ల బహిరంగంగా మద్యపానం చేస్తున్నారని, అందువల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చింది.
లిక్కర్ షాపు పక్కనే పర్మిట్ రూమ్
పర్మిట్ రూమ్ ప్లింత్ ఏరియా 1,000 చదరపు అడుగులకు మించకుండా ఉండాలి. ఇది తప్పనిసరిగా మద్యం దుకాణం పక్కనే ఏర్పాటు చేయాలి. వార్షిక లైసెన్సు రుసుము రూ.55 లక్షల లోపు ఉన్న దుకాణాలు పర్మిట్ రూమ్ ఏర్పాటుకు రూ.5 లక్షలు, రూ.65–85 లక్షల రుసుము ఉన్న దుకాణాలు రూ.7.50 లక్షలు రిటైల్ ఎక్సైజ్ సుంకంగా ఒకే విడతలో చెల్లించాలి.
ఆ తేదీలోపు లైసెన్స్ కు నగదు చెల్లించాలి
నవంబర్ 10వ తేదీ లోపు 2025- 26 సంవత్సరానికి సంబంధించిన లిక్కర్ పర్మిట్ రూమ్ లైసెన్సు రుసుము చెల్లించాలి. దీనికి మద్యం దుకాణాల లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పర్మిట్ రూమ్‌లలో వంటకాలు అనుమతి లేదు. రెడీ టూ ఈట్ స్నాక్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. తాగునీరు, చేతులు కడుక్కోవడానికి నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం ఈ మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడమే ఈ పర్మిట్ రూమ్‌ల అనుమతుల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్న లిక్కర్ పాలసీ రద్దు చేసి కొత్త పాలసీ తీసుకొచ్చింది. లిక్కర్ షాపుల్లో వైసీపీ తీసుకొచ్చిన క్యాష్ ట్రాన్సాక్షన్ ను తొలగించి ఆన్ లైన్, కార్డుల రూపంలోనూ మందుబాబులు నగదు చెల్లించేలా చర్యలు చేపట్టింది. మద్యం షాపులకు దరఖాస్తులు సేకరణతో వేల కోట్ల ఆదాయం సైతం రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు, కొన్ని సామాజిక వర్గాలకు పది శాతం మద్యం షాపులు కేటాయించింది ప్రభుత్వం.