Flood Flow Into Krishna River : కృష్ణా నదిలోకి వరద ప్రవాహం భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే జిల్లాలైన ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు దిగడం, చేపలు పట్టడం వంటి పనులు చేయకూడదని స్పష్టం చేశారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
Also Read: నేడు, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్: ఐఎండీ
కీలక ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న నీరు
గోదావరి, కృష్ణా నదుల వరద ప్రవాహంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద స్వల్పంగా కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సుంకేసుల వద్ద ఇన్ ఫ్లో 47,600 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 47,235 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.32 లక్షల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.51 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు నీటి నిల్వ ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2.88 లక్షల క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి కృష్ణా నదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తిస్థాయిలో వరద తగ్గేంతవరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అత్యవసర సహాయానికి ఫోన్ నెంబర్లు ఇవే
అత్యవసర సహాయం కావాల్సిన వారి కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకంగా నెంబర్లను కేటాయించింది. వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. అత్యవసర సహాయం కోసం కొన్ని ఫోన్ నెంబర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సహాయం కావాలనుకునే వాళ్ళు 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాద్ వెల్లడించారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ అధికారులు జారీచేసే సూచనలను పాటించాలని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రమాదానికి గురి కావద్దని ఆయన స్పష్టం చేశారు.
Also Read: విద్యార్ధులకు గుడ్ న్యూస్, ఆ ఒక్కరోజు కలిపితే వచ్చేవారంలో వరుసగా 5 రోజుల సెలవులు