YSR Awards 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు–2022 ను ప్రదానం చేసింది. ఈ అవార్డులు ఇలా అందించడం ఇది వరుసగా రెండో ఏడాది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడారు. విశిష్ట సేవలు అందించిన వారికి దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలోనే ఇలాంటి అవార్డులు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ అభినందలు తెలిపారు. వ్యవసాయం, ఆర్ట్ - కల్చర్, లిటరేచర్, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మందికి, సంస్థలకు 30 అవార్డులను అందజేశారు. ఇందులో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తోందని చెప్పారు. ఈసారి వ్యవసాయంలో 5, కళలు – సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ఇస్తున్నట్లుగా సీఎం జగన్ చెప్పారు.
వీరిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పని చేసిందని తెలిపారు. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లుగా చెప్పారు.
వైఎస్ఆర్ లాంటి మహా నేత పేరుతో పురస్కారాలు ఇవ్వడం సంతోషంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తన మార్క్ పాలనతో వైఎస్సార్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాంతం అని అన్నారు. బహుళ ప్రతిభలు కలగలిసిన వారు ఇక్కడ ఉన్నారని, కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రసిద్ధి చెందాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. 4 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారని గుర్తు చేశారు.
Also Read: AP Formation Day 2022: ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - ఫోటోలు