CBN Delhi Tour: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 4న హస్తినకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు... ప్రధానమంత్రి మోదీ సహా పలువు కేంద్రమంత్రులోత సమావేశంకానున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు వివరించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చిస్తారు. 


ఆంధ్రప్రదేశ్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఈ నెలల ప్రవేశ పెట్టనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇతర అభివృద్ది, సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించాలి. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో ఉన్న అప్పులు, రాబడులు బేరీజు వేస్తున్నారు. 


అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కేంద్ర సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి మంగళవారం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి బయటపడేందుకు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొంత నిధులు సర్ధుబాటు చేస్తే వెసులుబాటు వస్తుందని కేంద్రంతో చర్చించనున్నారు. 


ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వాటిని ఈ టెర్మ్‌లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల అంశంపై మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి కేంద్రం నుంచి ఏదో రూపంలో నిధులు రాబట్టుకునేలా ఈ టూర్ ఉంటుందని అంటున్నారు. 


ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్రమంత్రులతో సమావేశంకానున్నారు. విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. అదే టైంలో కేంద్ర బడ్జెట్‌లో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.  ఆ బడ్జెట్‌లో వచ్చిన నిధులు ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీలో బడ్జెట్‌ రూపొందించనున్నారు.  


సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులంతా ఆయా శాఖల్లో ఉన్న నిధులు కొరతను చూసి నివ్వెరపోతున్నారు. డిప్యూటీ సీఎం అయితే తనకు జీతం వద్దని, ఆఫీస్ ఫర్నీచర్ కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటానని ఛాంబర్‌లో మార్పులు కూడా అవసరం లేదని తేల్చేశారు. ఈ స్థాయిలో నిధుల కొరత ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలని మంత్రులు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా పదే పదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 


వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో అద్భుతాలు చేయడం చాలా సంక్లిష్టతో కూడుకున్నదని అన్నారు చంద్రబాబు. అసలు ఆ నిధులు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో కూడా తెలియడం లేదని ఇంకా లెక్కలన్నీ తీస్తున్నామని ప్రజలకు తెలిపారు. లోతుగా వెళ్తే తప్ప ఎంత డ్యామేజీ జరిగిందో గుర్తు పట్టలేమన్నారు. ఆ పనిలోనే అధికారులు మంత్రులు ఉన్నారని ఆ వివరాల వస్తే ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అభిప్రాయపడ్డారు.