ఏపీ కార్యనిర్వాహణ రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్‌ సర్కార్‌... 2024 ఎన్నికల ముందు వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయపరమైన అడ్డంకులు ఉన్నా... విశాఖ  నుంచి పరిపాలన చేసేందుకు సిద్ధమువుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం నివాసంతోపాటు... ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసును విశాఖకు తరలించి అక్కడి నుంచే పాలన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో అనుకున్నదే అయినా... అడుగులు మాత్రం ముందుకు పడలేదు. కానీ... ఏడాది నుంచి విశాఖకు షిఫ్ట్‌ అయ్యేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్‌. దసరాకు విశాఖకు వెళ్లిపోవాలనుకున్నారు. కానీ... ఏమైందో ఏమో.. మళ్లీ డిసెంబర్‌కు వాయిదా వేసుకున్నారు. డిసెంబర్‌లో విశాఖకు మారిపోతానని సీఎం జగన్‌ ప్రకటించారు. ఈసారి మాత్రం విశాఖకు మారడం పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు.


డిసెంబర్‌లో విశాఖకు మారుతానన్న సీఎం జగన్‌ ప్రకటనతో... ఈ నెలాఖరున జరగనున్న ఏపీ కేబినెట్‌ భేటీపై కూడా ఆసక్తి రేగుతోంది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా విశాఖకు రాజధాని తరలింపుపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిసెంబర్‌లో విశాఖకు మారుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ.. ఏ రోజున అన్నది మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు. ఈ నెలాఖరును జరుగుతున్న కేబినెట్‌ భేటీలో తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


మరోవైపు... రాజధానిలో వసతులు, సౌకర్యాలపై పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విశాఖలో పర్యటిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం మార్పు,  అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలు, నిర్మాణాలను పరిశీలిస్తోంది. సీఎం కార్యాలయం ఎక్కడ ఉండాలి, ఏ శాఖలు  విశాఖకు రావాలి, వస్తే ఆయా శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎక్కడ ఉండాలి అనేది కూడా కమిటీ పరిశీలిస్తోంది. ఈ కమిటీ కూడా కేబినెట్‌ భేటీలోగా నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.


ఇక.. ఈనెల 31న ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈమేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు ఈనెల 27వ తేదీలోపు సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు.