ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravathi) కోసం ఆ ప్రాంత రైతులు మరోసారి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. యర్రబాలెం గ్రామానికి చెందిన దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాస రావు పిటిషన్ వేశారు. 


రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఉద్దేశపూరకంగానే అమలు చేయడం లేదని హైకోర్టులో ఇద్దరు రైతులు పిటిషన్ వేశారు. దీనికి అధికారులు, ప్రభుత్వ పెద్దలే బాధ్యులని వ్యాజ్యంలో పేర్కన్నారు రైతులు. 


ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ సమీర్‌శర్మ, జీఏడీ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి సునీత, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, అప్పటి ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థికశాఖ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌, పురపాలక ముఖ్యకార్యదర్శి వై. శ్రీలక్ష్మీ, సీఎం జగన్, అప్పటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. నెలరోజుల్లో పనులు ప్రారంభించి కనీస వసతులైన తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ లాంటి ఎమినిటీస్ కల్పించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని నిర్మించాలని మార్చి3న ఇచ్చిన తీర్పులో చెప్పింది. 


నెలలు గడుస్తున్నా ఆ తీర్పును ప్రభుత్వం పెద్దలు పట్టించుకోలేదని... ఆ తీర్పును ఉల్లంఘిస్తున్నారని రైతులు కోర్టుకు తెలియజేశారు. ఇందులో మంత్రులు, ముఖ్యమంత్రుల పాత్ర ఎక్కువ ఉందని... కోర్టు తీర్పు అమలు చేయకపోగా... న్యాయపాలనకు విఘాతం కలిగిస్తున్నారని అందులో అభిప్రాయపడ్డారు. వీళ్లంతా కోర్టు ధిక్కరణ చట్టంలో సెక్షన్ 2(6)ప్రకారం శిక్షార్హులని తెలిపారు. 


మార్చి మూడున అమరావతి కేసుల్లో తీర్పు ఇచ్చిన హైకోర్టు అమరావతి నిర్మాణ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం నిర్ధిష్ట సమయం పెట్టుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరిగినట్టు ఎక్కడా కనిపించడం లేదని రైతులు వాపోయారు. ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు రైతులు. 


ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం టౌన్‌ ప్లానింగ్ స్కీమ్స్‌ను అమలు చేయడం లేదని కోర్టుకు తెలిపారు రైతులు. భూములు ఇచ్చిన రైతులకు మౌలిక సౌకర్యాలు డెవలప్‌ చేసి ప్లాట్లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు కాలేదన్నారు. 


రాజధాని అమరావతిలో పనులు పూర్తి చేయడానికి ఐదేళ్ల టైం కావాలన్న సీఎస్‌ సమీర్‌శర్మ వేసిన అఫిడవిట్‌ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు రైతు సాంబశివరావు. అసలు అమరావతిని అభివృద్ధి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అందుకే కోర్టు విధించిన గడువు కంటే ఒక్కరోజు ముందు అఫిడవిట్‌ వేశారని గుర్తు చేశారు రైతులు. మౌలిక సదుపాయాలు కల్పించాలన్న కోర్టు తీర్పును హేళన చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 


కోర్టు తీర్పు చెప్పిన వెంటనే మంత్రులు రకరకాలుగా మాట్లాడారని.. మూడు రాజధానులకు కట్టబడి ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారన్నారు. శాసనసభలో చర్చ పెట్టి మరీ తప్పుడు సంకేతాలు పంపించారన్నారు.