Amaravati News: అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ సదస్సులో 9 ప్యానల్ డిస్కషన్లు, 50 డ్రోన్ స్టాల్స్ ఆకట్టుకోనున్నాయి. డ్రోన్ విస్తరణకు ఉన్న అవకాశాలు, ఉపాధి మార్గాలు, ఇతర సవాళ్లను ఈ సమ్మిట్‌లో చర్చిస్తారు. ఈ రంగంలో పేరున్న వివిధ సంస్థలకు చెందిన నిపుణులు, అధికారులు, యువకులు భారీగా తరలిరానున్నారు. అన్నింటిపై రెండు రోజుల పాటు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఏపీ తన డ్రోన్ పాలసీని ఆవిష్కరించనుంది.
అమరావతి వేదికగా డ్రోనోత్సవం
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇలాంటి సమ్మిట్ అమరావతి వేదికగా తొలిసారి భారీ స్థాయిలో జరుగుతోందని అభిప్రాయపడుతోంది. ఇలాంటి జాతీయ డ్రోన్ సదస్సు గతంలో ఢిల్లీలో జరిగిందని ఇప్పుడు అమరావతిలో జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది.
భారీగా రిజిస్ట్రేషన్లు
ఏపీ ప్రభుత్వం చేపట్టే డ్రోన్ సదస్సుకు జాతీయ స్థాయిలో భారీ స్పందన వచ్చింది. ఇందులో పాల్గొనేందుకు 6,929 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,711 మంది ప్రతినిధులు పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుంటే... 1,306 మంది చూసేందుకు వస్తామని తెలిపారు. 521 మంది జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటామని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు కోసం 221 అప్లికేషన్లు వచ్చాయి.
చంద్రబాబు ప్రారంభోపాన్యాసం
కాసేపట్లో ప్రారంభమయ్యే అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి స్పీచ్ ఇస్తారు. అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడతారు. డ్రోన్ తయారీ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి, తీసుకోవాల్సిన చర్యలేంటీ, డ్రోన్ హబ్‌గా భారత్‌ను తయారూ చేయాలంటే ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చలు ఉంటాయి.
ఇవాళ సాయంత్రం ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ ప్రదర్శన
కృష్ణా నదీ తీరంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి జరిగే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 5,500 డ్రోన్లతో చేపట్టే ప్రదర్శన ఈ సమ్మిట్‌కే హైలైట్ కానుంది. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో కానుందని ప్రభుత్వం చెబుతోంది. ఏడు ఆకారాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరో ప్రత్యేకతను చాటుకోనున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ డ్రోన్ ప్రదర్శనను విజయవాడలోని ప్రజలంతా చూసేందుకు ప్రభత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా నాలుగైదు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే డ్రోన్ ప్రదర్శనతోపాటు సాంస్క్రృతి కార్యక్రమాలు ఇతర ప్రొగ్రామ్ మొత్తం ఈ తెరపై చూడవచ్చు.
బహుమతులు కూడా ఇస్తున్న ప్రభుత్వం
ఈ డ్రోన్ సమ్మిట్‌లో నిర్వహించే డ్రోన్ హ్యాకథాన్‌లో విజయం సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. 9 థీమ్స్‌ను నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక్కో కేటగిరీలో బహుమతులు అందజేస్తారు. మొదటి స్థానం వచ్చిన వాళ్లకు మూడు లక్షలు, రెండో స్థానం వచ్చిన వాళ్లకు రెండు లక్షలు, మూడో స్థానంలో ఉంటే లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.
Also Read: దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్