Rs 11000 crore loan for construction of AP capital Amaravati | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్థీయేకు 11000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురితో సమావేశమయ్యారు. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (HUDCO- హడ్కో)అధికారులతో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. 


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి ఋణ సదుపాయంపై కీలకంగా చర్చ జరిగింది. అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ప్లానింగ్ విధానాన్ని హడ్కో అధికారులకు మంత్రి నారాయణ వివరించారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం కోసం ఏపీ CRDAకు రూ. 11000 కోట్ల రుణం మంజూరుకు హామీ ఇచ్చారు. దాంతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు 165 కోట్లు రుణం విడుదలకు హడ్కో అంగీకరించింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న నిధులకు హడ్కో మోక్షం కలిగించింది. ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఏపీ మంత్రి నారాయణ, అధికారులతో హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.


పట్టాలెక్కనున్న అమరావతి నిర్మాణ పనులు


కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం (కూటమి) ఏపీకి రావాల్సిన నిధులపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భారీగా రుణాలు సమీకరించడంలో ఓ అడుగు ముందుకేసింది. ఏపీ మంత్రి నారాయణ ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపి హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రుణాల మంజూరుకు హామీ వచ్చేలా చేశారు. ఈ నిధులు కనుక విడుదలైతే అమరావతి నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం, అన్నింటి కంటే ముఖ్యంగా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాజధాని అమరావతిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు.


అమరావతి నిర్మాణ పనులు పున:ప్రారంభం


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు పున:ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద  అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడంతో అమరావతి పనులను పట్టాలెక్కిస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు సీఎంగా 7 అంతస్తుల్లో రూ.160 కోట్ల వ్యయంతో సీఆర్‌డీఏ పనులను చేపట్టారు. 3.62 ఎకరాల్లో జీ ప్లస్‌ 7 భవనాన్ని ఏపీ ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తోంది. దాంతోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌, పార్కింగ్ కు మరో 2.51 ఎకరాలు సైతం ప్రభుత్వం కేటాయించింది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణాన్ని  ప్రారంభించగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ నెగ్గడంతో రాజధాని అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖ వైపు ఫోకస్ చేశారు. ఈ మే నెలలో జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. మరోసారి అమరావతి నిర్మాణ పనులపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు