CM Chandrababu Key Announcement On Free Gas Cylinder Scheme: సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ దీపావళి నుంచి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు మహిళలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ ఏర్పాట్లు చేయాలని.. 31 నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తింపచేయాలని స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. పథకం అమలు, విధి విధానాలపై సమీక్షించారు. సమావేశంలో తొలుత పౌర సరఫరాల శాఖ కార్యదర్శి పథకానికి సంబంధించి పీపీటీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 కాగా.. కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతీ సిలిండర్ ధర రూ.851గా ఉందని వివరించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుందని.. ఐదేళ్లకు రూ.13,423 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ప్రతీ 4 నెలల వ్యవధిలో..


మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దీపం పథకం మరో గొప్ప ముందడుగు అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'ఈ దీపావళి పండుగతో ఇళ్లల్లో వెలుగులు తెస్తుంది. ఆర్థిక సమస్యలున్నా పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమల్లో వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. లబ్ధిదారులు ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తాం. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చాం. ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. పేదల జీవన ప్రమాణం పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయి.' అని సీఎం పేర్కొన్నారు.


ఉచిత ఇసుకపై కీలక ఆదేశాలు


మరోవైపు, ఉచిత ఇసుకపైనా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంపై సోమవారం సమీక్షించిన ఆయన.. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మార్గాల్లో తరలింపు అధికంగా జరుగుతోందని.. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలన్నారు. రీచ్‌ల్లో తవ్వకాలు, లోడింగ్ ప్రైవేట్‌కు అప్పగింతపై ఆలోచన చేయాలని అన్నారు.


Also Read: Anantapur Crime News: ఒక్క రాంగ్ కాల్‌తో లైఫ్ క్లోజ్ - నా భర్తను వదిలివస్తా, నువ్వు నీ భార్యను విడిచిపెట్టు! ఊహించని విషాదం