MLA Anirudh Reddy and MLC Balmoori Venkat visits Tirumala Temple | తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం లేదని తెలంగాణ నేతలు ఆరోపించారు.


అసలేం జరిగిందంటే.. 
తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమలలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భద్రాచలం, యాదాద్రి ఆలయానికి వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్‌ అమలవుతోందన్నారు. కానీ  తెలంగాణ ఎమ్మెల్యేలపై తిరుమలలో ఎందుకు చిన్నచూపు అని అనిరుధ్ రెడ్డి, బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. 


తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయమంటారా?


తిరుమలలో బాధతో మాట్లాడుతున్నామంటూ తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వరా అని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని చెబుతారు, కానీ తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.  టీడీపీ, వైసీపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చా, ఏపీ ఎమ్మెల్యేలను రానివ్వకుండా  మేం కూడా అడ్డుకోవాలా అన్నారు. తెలంగాణ ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్, వారి సిఫార్సు లేఖలపై స్పందించాలని బల్మూరి వెంకట్ కోరారు.


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు


తిరమల లడ్డూ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపడం తెలిసిందే. తిరుమల శ్రీవారి అత్యంత పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పదే పదే తిరుమల లడ్డూ వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని, శ్రీ వెంకటేశ్వరస్వామికి అపచారం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ చేసిన తప్పుల్ని క్షమించి అందర్నీ చల్లగా చూడాలంటూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రాముడి పున: ప్రతిష్టకు తిరుమల నుంచి కల్తీ లడ్డూలు వెళ్లాయని వ్యాఖ్యానించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.