Strange Incident In Kadapa District: ఓ కోతి.. అరటిపండు.. సీన్ కట్ చేస్తే ఓ వ్యక్తికి కత్తిపోట్లు. ఇది కడప జిల్లాలో జరిగిన విచిత్ర సంఘటన. ఓ కోతికి వ్యక్తి అరటిపండు ఇస్తే అది తినకుండా కింద పడేసింది. దీంతో సదరు వ్యక్తి కోతిని దూషించగా.. కోతి యజమాని కోపంతో అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలోని (Kadapa District) రైల్వేకోడూరులో రైలులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓబులావారిపల్లె (Obulavaripalle) మండలం బొంతవారిపల్లెకు చెందిన జవ్వాది లక్ష్మయ్య, రేవూరి సునీల్ కుమార్, పండుగోల శేఖర్‌లు ఆదివారం రేణిగుంట సమీపంలోని కరకంబాడి వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు.
వానరం కారణంగా వాగ్వాదం
వీరు ఎక్కిన రైలులోని బోగీలో కోతిని ఆడిస్తూ జీవనం సాగించే రెహమాన్ అనే వ్యక్తి డోర్ వద్ద వానరంతో కూర్చున్నాడు. ఇది గమనించిన సునీల్ కుమార్ కోతికి అరటిపండు ఇచ్చాడు. అయితే, అది తినకుండా పండు కింద పడేయడంతో సునీల్ కోతిని దూషించాడు. వెంటనే కోతి యజమాని రెహమాన్ అతనితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. సునీల్ స్నేహితులు సైతం అక్కడకు వచ్చి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెహమాన్ తీవ్ర ఆగ్రహంతో కత్తితో సునీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అతని వీపు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కాగా.. రెహమాన్ బాలపల్లె స్టేషన్‌లో దిగి పారిపోయాడు. బాధితున్ని అతని స్నేహితులు రైల్వే కోడూరులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని.. నిందితుడిని బాలపల్లెలో అదుపులోకి తీసుకున్నామని రేణిగుంట రైల్వే ఎస్సై రవి అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని రైల్వే కోడూరు పోలీసులు తెలిపారు.