Amaravati News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024"కు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతంలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్‌ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌ వేదికగా జరిగే సమ్మిట్‌పై శుక్రవారం ఏపీ సీఎస్‌ నీరభ్‌ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిహ్వరించారు. 


డ్రోన్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు 


డ్రోన్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం సహా ఇతర సమస్యల్లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలన్నారు. 


భారీగా రానున్న ప్రతినిధులు


ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో  ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితోపాటు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. వీళ్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీళ్లతోపాటు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు కూడా తరలి రానున్నారు. 


రెండు రోజులు 9 సెషన్లు


రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై చర్చించేందుకు 9 సెషన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి.


ఐదు వేల డ్రోన్‌లతో ప్రదర్శన


ఈ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీదారులు తమ ఉత్పత్తులు ప్రదర్శించేందుకు 40 సెంటర్లు ఉంటాయి. 22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్ వద్ద 5వేల డ్రోన్లతో అతి పెద్ద డ్రోన్ షో ఏర్పాటు చేశారు. లేజర్ షో, ఫైర్ వర్క్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత శోభను తీసుకురానున్నాయి. 


పెట్టుబడులు- ఉపాధి


ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి డ్రోన్ వాడకం, తయారీ కేంద్రంగా ఏపీని ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తోంది. వీటితోపాటు యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చూస్తోంది. ఈ లక్ష్యాలతోనే డ్రోన్ పాలసీని రూపొందించింది. ఈ సమ్మిట్‌లో డ్రోన్ పాలసీని విడుదల చేసి చర్చకు పెట్టనుంది.  


వివిధ శాఖల్లో డ్రోన్ సేవలను విస్తృతపరచడంతోపాటులో డ్రోన్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రం వాటాను 25 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డ్రోన్ పైలట్‌ల ద్వారా రిపేర్‌లో శిక్షణ ఇవ్వడంతో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీన్ని ఓ సెబ్జెక్ట్‌గా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని కూడా చూస్తోంది ప్రభుత్వం. 


మరింత సరళతరంగా పాలసీ


డ్రోన్‌ వాడకంపై ఇప్పుడు చాలా పరిమితులు ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. డ్రోన్ నిర్వహణకు ఇప్పుడు దాదాపు పాతి నిబంధనలు ఉన్నాయి. వాటిని ఐదుకు పరిమితం చేయాలని చూస్తోంది. వాటిని తగ్గించడమే కాకుండా అనధికారింగా ఎవరైనా అక్రమాలకు వాడితే వేసే శిక్షలు కూడా ఆ స్థాయిలోనే ఉండేలా చూస్తోంది. రూల్స్‌కు వ్యతిరేకంగా డ్రోన్స్ వాడితే లక్ష రూపాయల వరకు ఫైన్ వేసేలా.. 300 కిలోల నుంచి 500 కిలోల వరకు బరువు ఉన్న వాటిని వాడేలా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం సెక్యూరిటీ క్లియరెన్సుతో సంబంధం లేకుండా అనుమతులు తీసుకోవాలని చూస్తున్నారు. గ్రీన్ జోన్‌లో వాడుకునేందుకు అనుమతులు అవసరం లేదు. రెడ్, ఎల్లో జోన్లలో మాత్రం అధికారుల పర్మిషన్ అవసరం. 


Also Read: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక