Chandrababu Amit Shah Meet: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులపై చర్చల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు - బీజేపీ అగ్ర నేత అమిత్ షా - జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. గురువారం (మార్చి 7) రాత్రి 10.45 గంటల సమయంలో కూడా అమిత్ షా - చంద్రబాబు - పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీరితో పాటు జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలోనే ఈ నలుగురు నేతలు భేటీ అయ్యారు.
తొలుత చంద్రబాబు - అమిత్ షా - జేపీ నడ్డా మాత్రమే అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ వచ్చి వీరితో భేటీ అయ్యారు. మూడు పార్టీల అగ్ర నేతల ఈ భేటీతో ఏపీలో పొత్తులు ఫైనల్ కావడమే కాకుండా, సీట్ల సర్దుబాటు అంశంపై కూడా క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
ఏపీలో టీడీపీ - జనసేనతో పాటు బీజేపీ పొత్తు కోసం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడే పొత్తు ఖరారు అవుతుందని భావించారు. కానీ, దానికి కొనసాగింపుగా తాజాగా మరోసారి వీరి భేటీ జరుగుతోంది. పొత్తుల విషయంలో రేపు (మార్చి 8) స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ - జనసేన కలిసి ఏపీలో 99 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.