Sajjala On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ వర్థంతి నాడు ఆయన దార్శనికతను తల్చుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒక విధంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ ను ఉద్దేశించి స‌జ్జల మీడియాతో మాట్లాడారు.  తొలిసారిగా తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు సెప్టెంబరు 1, 1995 అని చంద్రబాబు మీడియాతో మాట్లాడారని పత్రికల్లో చూశామన్నారు.  ఇవాళ కూడా కమిటీ సమావేశం పేరుతో మీడియాను ఎదురుగా కూర్చోబెట్టుకుని, అనర్గళంగా తనకు తాను ఘనంగా చెప్పుకొచ్చారన్నారు. తాను సీఎం పదవి చేపట్టి 27 ఏళ్లు అయిందని మరోసారి గుర్తు చేశారన్నారు. అంటే దాదాపు 30 ఏళ్లు, 2004లో మహానేత వైయస్సార్‌ తిరుగులేని నాయకుడిగా గెల్చి, పార్టీని గెలిపించి సీఎం పదవి చేపట్టారని సజ్జల అన్నారు. అదే తరహాలో 2019లో కూడా సీఎం  వైఎస్ జగన్‌ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. ఆ స్థాయిలో తానూ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు.

  


వెన్నుపోటుతో పదవి   


1994లో ఎన్టీ రామారావు అఖండ మెజారిటీతో గెల్చి సీఎం అయ్యారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి వ్యవస్థలో ఉన్న అనుకూలత వల్ల చంద్రబాబు 1995 సెప్టెంబరు 1న సీఎం అయ్యారు. అందుకు ఆ ఏడాది ఆగస్టులో కుట్రకు తెరలేపారు. నిజానికి అప్పుడు చంద్రబాబు వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా, అసత్యాలు రాయించి, ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టించారు. అలా గవర్నర్‌ను కూడా అనుకూలంగా మార్చుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజామోదంతో కాకుండా, వెన్నుపోటుతో సీఎం అయినానని చెప్పుకోవాలి. కానీ ప్రజలు ఎన్నుకున్న సీఎంగా, ప్రజలు తనకే తీర్పు ఇచ్చినట్లుగా, ఎన్టీఆర్‌తో కలిసి తాను తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. ఆయన దుస్సాహసం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకపోయిన ఎన్టీ రామారావు 6 నెలల్లోనే ప్రాణాలు విడిచారు. 1996 జనవరిలో ఆయన పరమపదించారు. ఇవాళ కూడా తిమ్మిని బమ్మిని చేయడం, అసత్యాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు ఆనాడు నేరం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మామకు వెన్నుపోటు పొడిచి నేరం చేశారు. ఆ విధంగా పార్టీని కబ్జా చేసుకుని, దాన్ని ఇవాళ ఒక అక్రమ వ్యాపార మాఫియా సంస్థ మాదిరిగా తయారు చేశారు.


అధికార యావ తప్ప మ‌రొక‌టి లేదు 


2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు తాను ఏదో పొరపాటు చేశానని చంద్రబాబు చెప్పుకున్నారని సజ్జల అన్నారు.  పాలనలో మునిగిపోయి, పార్టీని పట్టించుకోకపోవడం వల్ల దెబ్బ తిన్నానని, లేకపోతే తామే అధికారంలో ఉండేవాడినని చెప్పుకొచ్చారన్నారు.  చంద్రబాబు ఆలోచనలో పార్టీ, అధికారం తప్ప, ప్రజలు లేరన్నారు. ప్రజలను పట్టించుకోక పోవడం వల్ల అనడం లేదన్నారు. పార్టీని పట్టించుకోలేదని అన్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పాలనలో ఎలా దోచుకోవాలన్న ఆలోచన, తన ముఠాతో కలిసి ఇంకా ఎలా దోచుకోవాలి అన్న యావే తప్ప, ఎక్కడా ప్రజల ప్రస్తావన లేదని విమర్శించారు. కేవలం ప్రజలకు బుద్దిలేదు అని అన్నప్పుడే ఆయనకు వారు గుర్తుకు వస్తారన్నారు. ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోవాలి? అని చంద్రబాబు ఆలోచించరని, ఎందుకంటే ఆయన ప్రజల నుంచి రాలేదన్నారు. చంద్రబాబు ప్రజా నాయకుడు కాదని, అడ్డదారిన వెన్నుపోటుతో పదవి పొందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read : రాజకీయాల్లో ఆ "పవర్" ఏది ? పవన్ కల్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ ఎప్పుడవుతారు?