Minister Roja On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. నిన్న వీకెండ్ బై పీకే చూశామని, ఆదివారం వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతుంటారని ఎద్దేవా చేశారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న సర్వేల వల్లే గతంలో బోర్లాపడ్డారని విమర్శించారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయంటే జనసేనకు 130 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు.
పవన్ ప్యాకేజీ స్టార్
"2019లో నా మాట శాసనం అన్నావ్, అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తానన్నావ్. ప్రజలు నిన్ను శాసనసభలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. 175 చోట్ల పోటీచేసేందుకు జనసేనకు క్యాండెట్లు కూడా లేరు. ముందు కౌన్సిలర్లు, ఎంపీటీసీలుగా మీ పార్టీ వారిని గెలిపించుకో. పవన్ ను చూసి తెలుగు ఇండస్ట్రీ హీరోలంతా తలదించుకుంటున్నారు. 2014లో టీడీపీకి, బీజేపీకి ఓట్లేయించి ఏం సాధించావ్. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిచేశావ్. పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజి స్టార్. గతంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోయావ్. విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా సినిమా షూటింగ్ లు చేసుకున్నావా?"- మంత్రి రోజా
పవన్ కు ఇదేనా ఛాలెంజ్
పవన్ కల్యాణ్ కు మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే 175 సీట్లలో జనసేన సింగిల్ గా పోటీచేయాలని సవాల్ చేశారు. లోకేశ్ పాదయాత్ర పోస్ట్ పోన్ చేయగానే పవన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి అర్ధమవుతోంది లోకేశ్ , పవన్ ఒకటేనన్నారు. సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని హితవుపలికారు. పందులన్నీ ఒకచోట చేరి జగనన్నను ఓడిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగనన్న అడ్డా అంటూ మంత్రి రోజా అన్నారు. అధికారదాహంతోనే లోకేశ్ ను చంద్రబాబు మంత్రి చేశారని విమర్శించారు. ఎద్దు ఎద్దుల బండి ఎక్కొస్తుంటే అందరూ నవ్వుతున్నారన్నారు.
చంద్రబాబు, కరవు కవలలు
"టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా?. చంద్రబాబు రైతు ద్రోహి. రైతులకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రైతులకు చేసింది శూన్యం. చంద్రబాబు, వైఎస్ జగన్ కు మూడున్నర లక్షల కోట్లు అప్పులను మిగిల్చిపోయారు. రైతులకు అండగా నిలబడింది వైఎస్ఆర్ ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగ వృద్ధి రేటు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసిందో రైతులు తెలుసుకోవాలి. అసెంబ్లీలో టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కరవుకు గడ్డం పెడితే అది చంద్రబాబు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. వరుణుడు వైఎస్ఆర్ కుంటుంబంలో సభ్యుడిగా మారాడు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్లన్నీ జలకళ సమతరించుకున్నాయి. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే చంద్రబాబు అసెంబ్లీకి రావాలి. సరైన ఫార్మాట్ లో వస్తే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చిస్తాం"- మంత్రి రోజా
Also Read : ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్‌ఫిట్- పోలవరం చర్చలో జగన్ హాట్ కామెంట్స్