Minister Merugu Nagarjuna : టీడీపీ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలను సమీక్షించారు. టీడీపీ హయాంలో ఈ-ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రెన్ క్లీనర్ల సరఫరా కోసం టెండర్లు పొంది ప్రభుత్వం నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సుగా తీసుకున్న కెనటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ (పూణే), వెంకటేశ్వరా ట్రేడర్స్ (తాడేపల్లి), ఈగల్ అగ్రిఎక్విప్ మెంట్స్ (కావలి), ఎంట్రాన్స్ ఆటోమోబైల్స్ (పెద్ద తాడేపల్లి) సంస్థలకు చెందిన డీలర్లు వద్ద రూ.46 కోట్లు పొందారు. దానికి సంబంధించిన వాహనాలు సరఫరా చేయడంగానీ, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడం గానీ జరగలేదని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఎస్సీ కార్పొరేషన్ సొమ్మును తిరిగి రాబట్టడానికి ఆయా డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సీబీ సీఐడీకి ఫిర్యాదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కు సంబంధించిన బకాయిల వసూళ్లను ముమ్మరం చేయాలని కోరారు. ఎస్సీలకు చెందిన సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగమైనా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ.డీలు వెనక్కి
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి నాగార్జున ఆదేశించారు. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఇ.డి)లుగా పనిచేస్తున్న వారిలో ఏడాది కాలం సర్వీసును పూర్తి చేసిన వారిని వారి సొంత శాఖలకు వెనక్కి పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో భూమి కొనుగోలు పథకం (ఎల్పీఎస్) ద్వారా ఎస్సీలకు కేటాయించిన 25 శాతం రుణ మొత్తాన్ని మాఫీ చేసే అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలనలో ఉందన్నారు. ఈ విషయంపై సీఎం త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వెల్లడించారు.
అజయ్ పథకంలో
పీఎం అజయ్ పథకంలో భాగంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.60 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రాబోయే జనవరి నెలాకరు లోపుగా అమలు చేస్తామని మంత్రి నాగార్జున ప్రకటించారు. ఈ పథకం క్రింద 2022-23 సంవత్సరంలో మరో రూ.130 కోట్ల మొత్తం మంజూరు అయ్యిందన్నారు. స్వచ్ఛత ఉద్యమై యోజన పథకం కింద రూ.120 కోట్లు డీ సెజ్లింగ్ యంత్రాల కొనుగోలు కోసం మంజూరు కాగా దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచల ప్రకారంగా ఎస్సీలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎక్కడా అలసత్వం లేకుండా పని చేయాలని నాగార్జున కోరారు.