Kurnool Crime News: కర్నూలులో సంచలనం సృష్టించిన ఇద్దరు తోడికోడళ్ల హత్య ఘటనలో కుటుంబ సభ్యులే వారిని చంపి ఉంటారని, మహిళల తల్లిదండ్రులు ఆరోపించారు. వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా వారికి పిల్లలు పుట్టలేదనే కోపంతోనే అత్తింటివారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారని వివరిస్తున్నారు.
"నా బిడ్డకు జరిగిన ఘోరం ఏ బిడ్డకూ జరగొద్దు. మీరు తగిన చర్య తీసుకోవాలే నా బిడ్డ ఘటన మీద. సంతానం కావాలని బాధ వెట్టినారు నాయనా గంతే. దవాఖాన్లకు గూడ రార్ సార్ మేమే చూపిచ్చుకుంటుంటిమి. పెండ్లై రెండు సంవత్సరాలు ఎల్లిపోయింది గంతేనని" రేణుక తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.
"పిల్లలు పుట్టలేరు. పిల్లలే లే. పిల్లలు లేనందుకే అంత బాధ పెట్టినారు సార్. బాధ పెట్టినా కానీ మేమే డాక్టర్ కాడ సూపిస్తున్నం. అయినా సరే వాళ్లు నా బిడ్డను సంపేసిర్రు." - ఆ ఇంటి మొదటి కోడలు తల్లి రామేశ్వరి
అసలేం జరిగిందంటే..?
తోడి కోడళ్లు ఇద్దరూ కలిసి పశువుల కోసం పచ్చగడ్డి తెచ్చేందుకని వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గడ్డి కోస్తున్నారు. కానీ ఇందులోనే వారి వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారి గొంతు కోశారు. ఆపై తలపై రాళ్లతో బాది దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన పెద్దరామ గోవిందు, చిన్నరామ గోవిందులు అన్నదమ్మలు. అయితే పెద్దరామ గోవిందుతో 26 ఏళ్ల రామేశ్వరితో ఏడేళ్ల కిందట, చిన్నరామ గోవిందుతో మూడేళ్ల కిందట 21 ఏళ్ల రేణుకకు వివాహం జరిగింది. వీరంతా ఒకేచోట కలిసి ఉంటూ.. వ్యవసాయం చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.
తోడి కోడళ్లు ఇద్దరూ పశువులుకు మేత తెచ్చేందుకు స్థానికంగా ఉన్న పొలాలకు వెళ్లారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడ్డి కోసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కొందరు దుండగులు గడ్డి కోస్తున్న తోడికోడళ్ల గొంతులు కోసేశారు. ఆపై రాళ్లతో వారి తలలు పగుల గొట్టి హత్య చేశారు. వాళ్లు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. గడ్డి కోసం వెళ్లిన రేణుక, రామేశ్వరి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. సాయంత్రం ఆరు గంటలకు అన్నదమ్ములిద్దరూ వారిని వెతుక్కుంటూ వెళ్లారు.
స్థానికంగా ఉన్న పొలం వద్దకు వెళ్లగా.. తోడి కోడళ్లు ఇద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. తమ భార్యలు చనిపోవడం చూసిన పెద్దరామ గోవిందు, చిన్న రామగోవిందు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులతోపాటు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులతో పాటు గ్రామస్థులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సొంత అక్కాచెల్లెల్లలాగా కలిసి ఉన్న తోడి కోడళ్లు ఒకేసారి హత్యకు గురి కావడం చూసి గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే దిశ డీఎస్పీ వెంకట రామయ్య, కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సై మల్లికార్జునలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రేణుక, రామేశ్వరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.