Margadarsi Case : మారదర్శి బ్రాంచ్ లు నిర్వహిస్తున్న ఫోర్ మెన్ లకు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శికి ఏపీ వ్యాప్తంగా 37 బ్రాంచ్ లు నిర్వహిస్తుందన్నారు. చిట్ ఫండ్స్ నిర్వహణపై వివరాలు అడిగితే హైదరాబాద్ లో ఉన్నారని చెబుతున్నారని, అక్కడికి వెళ్తే సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. మార్గదర్శి నిధులు ఉషోదయ కంపెనీకి తరలిస్తున్నారని తెలిపారు. ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్స్ కు తరలించారన్నారు. సీఐడీ విచారణతో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సహకరించకుండా ఇలాగే కొనసాగితే కంపెనీని మూసివేస్తామన్నారు.
విచారణకు సహకరించడంలేదు
మార్గదర్శిలో నిర్వహించిన సోదాల్లో యాజమాన్యం సహకరించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. మార్గదర్శిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని, చిట్‌ఫండ్స్ నగదు ఇతర సంస్థలకు మళ్లిస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ లో 37 చిట్ ఫండ్ యూనిట్లలో, 17 మార్గదర్శి బ్రాంచ్ లో తనిఖీలు చేశామన్నారు. మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ లకు పూర్తిగా కంట్రోల్ ఉండాలని, కానీ వారికి ఎలాంటి చెక్ పవర్ లేదన్నారు. రూ.500 చెక్ పవర్ మాత్రమే ఉందన్నారు. చిట్ ఫండ్‌లో నగదుపై అసలు వాళ్లకి నియంత్రణ లేదన్నారు. చిట్ ఫండ్స్ నిర్వహణలో అన్ని అధికారాలు హెడ్ ఆఫీస్‌కే ఉన్నాయని అంటున్నారని, హైదరాబాద్ మార్గదర్శి ఆఫీస్ లో తనిఖీలు చేస్తే అక్కడ ఎవరూ సహకరించలేదన్నారు. హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చారన్నారు. ఏపీలో జరిగిన వాటికి సంబంధం లేదని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని తెలిపారు. ఏపీలో చిట్ వేసిన వాళ్ల డబ్బులు మాత్రం వేరే రాష్ట్రంలో పెడుతున్నారని తెలిపారు.
వేరే కంపెనీలో పెట్టుబడులు
సీఏతో అకౌంట్స్ ను ఆడిట్ చేయించామని ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆడిటింగ్ లో కొన్ని మార్గదర్శి బ్యాలన్స్ షీట్లలో నిధులను స్పెక్యులేటివ్ మార్కెట్ లోకి మళ్లించారన్నారు. ఆ నిధులను ఉషా కిరణ్ సంస్థకు మళ్లించారన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వేరే వ్యాపారం చెయ్యడానికి వీలు లేదని నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వేరే కంపెనీలలో పెట్టుబడులు పెట్టారన్నారు. బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మళ్లించారని అభియోగం ఉందన్నారు. ఈ నిధులపై పూర్తి విచారణ జరపాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఏడు మార్గదర్శి బ్రాంచ్ లలో సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు. అనుమతి లేకుండా డిపాజిట్లను సేకరిస్తున్నారని ఐడీ రామకృష్ణ తెలిపారు. మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీస్ పై 15 వేల కోట్లు సేకరించినప్పుడు నోటీసులు ఇచ్చామన్నారు.
చిట్టీదారుడికి తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియడంలేదు- సీఐడీ చీఫ్ సంజయ్
మార్గదర్శిలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు లో ఫోర్ మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేశామన్నారు. 1982 చిట్ ఫండ్ ఆక్ట్ 76,79 సెక్షన్ ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. అన్ని బ్రాంచ్ ల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు తరలిస్తున్నారన్నారు. చిట్టీదారుడుకి తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియడంలేదన్నారు. జవాబుదారీతనం లేదని తేలడంతో మార్గదర్శిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్స్ కు వ్యతిరేకమన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ,గుంటూరు బ్రాంచ్ ల ఫోర్ మెన్ లను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. చిట్స్ లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల అనుమతితోనే చిట్ ప్రారంభించాలని సీఐడీ చీఫ్ సంజయ్ సూచించారు.