Mallikarjun Kharge on PM Modi:
విమర్శలు..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ ప్రభుత్వం మండి పడ్డారు. మోదీ హయాంలో న్యాయం, ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయిందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు మొదలైన కాసేపటికే పార్లమెంట్‌లో దుమారం రేగింది. యూకేలో రాహుల్ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. గందరగోళం కారణంగా ఉభయ సభలూ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
"మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి విలువే లేకుండా పోతోంది. నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న వాళ్లే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
గతంలో ఓ సారి ప్రధాని మోదీ కూడా కొరియాలో భారత్‌ను తక్కువ చేసి మాట్లాడారని, ఆయన మాట్లాడింది ఒప్పు అయినప్పుడు రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది అని ప్రశ్నించారు ఖర్గే.
"ఓ కాలేజీలో మేం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది పెద్ద నేరం అంటున్నారు. కొరియాలో ప్రధాని మోదీ చేసిందేంటి..? 70 ఏళ్లలో భారత్‌లో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడారు. ఆ సమయంలో ఎంతో మంది భారత్‌లో పెట్టుబడులు పెట్టారు. కెనడాలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశాన్ని క్లీన్ చేసేస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ చేస్తే ఒప్పు, రాహుల్ గాంధీ చేస్తే తప్పు అయిపోతుందా"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
అదానీ అంశాన్నీ ప్రస్తావించిన ఖర్గే...జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు 10 నిముషాలు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలకు మాత్రం కనీసం 2 నిముషాల సమయం కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
"మా మైక్‌లు ఆఫ్ చేస్తున్నారు. మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. అందుకే ఆందోళన చేయాల్సి వచ్చింది. మేం బేతాళుడిలా వెంటాడుతూనే ఉంటాం"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు