టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఓ పక్క అనుమానితుల్ని విచారిస్తూనే మరో వైపు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో బేగంబజార్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు సర్వర్‌లోకి వెళ్లి లాగిన్‌ అయినట్టు పోలీసులకు అధికారులు తెలపడంతో ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. 


దళారుల వ్యవహారం కూడా బయటకు రావడంతో అనుమానితుల వేటలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. అందుకే నిన్న(మార్చి12న)జరగాల్సిన పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈనెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షను సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. 


ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. అతని నుంచి పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న నలుగురు అభ్యర్థులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా పది మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  


ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ల కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్.. విచారణలో పలు విషయాలు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. 


ముగ్గురు దళారులతో కలిసి పేపర్ లీకేజీకి కుట్రపన్నాడని, ఇందుకోసం రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. ప్రవీణ్ కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు గతంలో ఏమైనా లీకేజీలకు పాల్పడ్డడా నే కోణం లో అరా తీస్తున్నారు పోలీసులు. 


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీకి సంబంధించిన సర్వర్ హ్యాక్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని, పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. నిన్న (మార్చి 12) జరగాల్సిన టీపీబీవో (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్) రాత‌ ప‌రీక్ష 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం (మార్చి 11) రాత్రి కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 


తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.


తెలంగాణలో పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టుల భర్తీకి మార్చి 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న విడుదల చేసింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 11న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630  జీతంగా ఇస్తారు.