Nagababu On AP Govt : ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్ ఫిర్యాదు చేయడంపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. వైసీపీ అసమర్థ  పరిపాలనకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని నాగబాబు ట్వీట్ చేశారు. ఉద్యోగులు జీతాలు, బకాయిల కోసం  చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్నారు.  డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, ఆందోళన చేయడానికి అనుమతివ్వక, ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలున్న గవర్నర్ కు మొర పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారని నాగబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ నాగబాబు చురకలు అంటించారు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడంలేదని, కనీసం ఉద్యోగులు ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితులున్నాయన్నారు. వైసీపీ అసమర్థ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని నాగబాబు విమర్శించారు.  జనవరి 21, 22 తేదీల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జనసేన నేత నాగబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న కర్నూలు జిల్లా జనసేన వీరమహిళల సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం జనసైనికుల సభలో నాగబాబు పాల్గొంటారు. ఈ నెల 22న అనంతపురం జిల్లాలో వీరమహిళలు, జనసైనికుల సభల్లో నాగబాబు పాల్గొంటారు.






గవర్నర్ కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు 


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వంపై  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.   ప్రభుత్వం దగ్గర ఉన్న ఉద్యోగుల బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని .. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారులు గవర్నర్‌  కు ఉంటాయని.. ఉద్యోగ నేతలు చెబుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.  కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది... 15వ తేదీ వరకు జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని.. ఈ అంశాలన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ నేతుల ప్రకటించారు.   ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ, వారితోపాటు మరో ఆరుగురు ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.  జనవరి 15 తర్వాత ప్రభుత్వం ఏ విషయం తేల్చకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఇదే మొదటి సారి. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ఉండదు. కానీ జీతాలు రావడంలేదని, సకాలంలో బెనిఫిట్స్ రావడంలేదని ఫిర్యాదు చేయడం ఉద్యోగ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 


చట్టం కోసం డిమాండ్ 


ఉద్యోగుల డీఏ బకాయిలు,జీపీఎఫ్ బకాయిలు,సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందని ఉద్యోగ నేత సూర్యనారాయణ గవర్నర్ ను కలిసిన అనంతరం వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాలని గవర్నర్ ను కలిశామన్నారు. ఉద్యోగులు,పెన్షనర్లు,దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని, ఉద్యోగుల వ్యవహారాల్లో ప్రభుత్వం జాలి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామన్నారు. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరామన్నారు. తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.