Pawan Kalyan : విజయవాడ, జగ్గయ్య పేట నియోజకవర్గాల్లో జనసైనికులపై వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ నేతలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తెలియజేస్తుందన్నారు. విజయవాడలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ను జనసేన జెండా ఆవిష్కరించకుండా అడ్డుకోవడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు జేసీబీతో కూల్చివేసిన ఘటనలో దోషులపై కేసు నమోదు చేయకుండా జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో పోలీసులు ఆలోచించుకోవాలన్నారు. 


పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడదు 


జనసేన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదనే సాకుతో పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు ప్రవర్తిస్తున్నారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.  అధికార పార్టీ నేతలు అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని గ్రామ గ్రామాన పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మెలు మున్సిపల్‌, పంచాయతీల ముందస్తు అనుమతి తీసుకుంటున్నారా? అని నిలదీశారు. వాటన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలారా?, అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఉనికిని లేకుండా చేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రోడ్డు మీదకు రాలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తానే స్వయంగా రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. పోలీసుల సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారని, మరో పార్టీ అధికారంలోకి వస్తే తలదించుకునే పరిస్థితి రాకూడదన్నారు. 






జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ 


 విజయవాడలో శుక్రవారం జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు వైసీపీ నేతలు యత్నించడంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు అక్కడు చేరుకుని నిరసన తెలిపారు. రోడ్డు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని పోతిన మహేష్ ఆరోపించారు.   


Also Read : Nara Lokesh On Anna Canteen : ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహిస్తాం, తెనాలి ఘటనపై లోకేశ్ ఫైర్


Also Read : Tenali Anna Canteen : తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !