AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ప్రస్తుతం సీఎంవో స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎస్ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. బుడితి రాజశేఖర్ సెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి
ఏపీ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తతు ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం ఈ నెల(నవంబర్) 30కు పూర్తికానుంది. డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. 2024 జూన్ వరకు జవహర్ రెడ్డి సర్వీసులో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపించింది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పుడు సీఎంకు స్పెషల్ సెక్రెటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు.
సమీర్ శర్మకు పదవి
సీఎస్ గా పదవీ విరమణ అనంతరం సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ ఛైర్మన్ పోస్టులోనూ ఆయనను ఇంఛార్జీగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప జగన్ ప్రభుత్వ హయాంలో పని చేసిన సీఎస్‌లందరూ రిటైర్‌మెంట్ తర్వాత ఏదో ఒక పదవిలో నియమితులయ్యారు. ఇప్పటి వరకు నలుగురు ఐఏఎస్‌లు సీఎస్‌లుగా పని చేశారు. మొదట ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత నీలంసహ్నీ, అదిత్యనాథ్ దాస్, ఇప్పుడు సమీర్ శర్మ. అందరు కూడా సీఎంకు అత్యంత సన్నిహింతగా మెలిగారు. ఎల్వీ సుబ్రహ్మణానికి డిమాష్ వస్తే మిగతావాళ్లకు మాత్రం రిటైర్ అయిన తర్వాత వేర్వేరు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. నీలం సాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గానూ, ఆదిత్య నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు.