ఎప్పుడూ అధికారపార్టీకే న్యాయస్థానాల నుంచి చీవాట్లు... ఇప్పుడు విపక్షాలకు పరోక్షంగా మొట్టికాయలు పడ్డాయన్నట్లు ఉంది ఇప్పటం ఇష్యు. ఎన్నాళ్లనుంచో ఒక మంచి కబురు న్యాయస్థానాలనుంచి అధికారపార్టీకి అందింది. ఇప్పటం కూల్చివేతలపై నానా హంగమా చేసిన విపక్షాలకు ఒక్క తీర్పుతో చెక్ పడినట్లయింది. 


గత కొన్నిరోజులుగా ఏపీలో రాజకీయదుమారానికి కారణమైన ఇప్పటం మరోసారి వార్తల్లో నిలిచింది. హైకోర్టు తీర్పుతో ఈ వివాదం ఇక సద్దుమణిగినట్టేనా?   ఈ తీర్పుతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం ?  ఇప్పటం కూల్చివేతలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికారపార్టీకి ఊరట నిచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించినందుకు గానూ పిటీషనర్లకి రూ.లక్ష చొప్పున జరిమాన విధించి షాకిచ్చింది. అంతేకాదు కోర్టు ముందుకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని 14మంది పిటీషనర్లు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ షాకింగ్‌ తీర్పు ఇవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో కన్నా విపక్షాల నుంచే ఎక్కువగా వ్యతిరేకత వస్తోందన్న టాక్‌ ఉంది. పథకాల నుంచి జీవోల వరకు జగన్‌ ఏది అమలు చేసినా ప్రతిపక్షాలు అడ్డుకోవడం పరిపాటిగా మారిందని అధికారపార్టీ విమర్శలు చేస్తూ ఉంది.


అలా ఈ మధ్యకాలంలో అధికార-విపక్షాల మధ్య నలిగిన అంశం ఇప్పటం. రోడ్ల విస్తరణలో భాగంగా ఇప్పటం ఊరిలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇదే విపక్షాలకు ఆయుధంగా మారింది.  ఈ కూల్చివేతలను నిరసిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలిచారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందించడమే కాదు త్వరలో జగన్‌ ప్రభుత్వం కూడా ఇలానే కూలిపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే టీడీపీ యువనేత నారాలోకేష్‌ కూడా వెళ్లారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యీగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా  ఇప్పటంలో పర్యటించడమే కాదు జగన్‌ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటం రోడ్ల విస్తరణపై విచారణ జరిపించడమే కాదు బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.


బీజేపీ కూడా ఇప్పటం రోడ్ల విస్తరణపై తనదైన స్టైల్లో స్పందించింది. ఇలా విపక్షాలన్నీ జగన్‌ సర్కార్‌ తీరుని తప్పుబడుతూ పార్టీలకతీతంగా అందరూ ఒక్కటై వైసీపీ సర్కార్‌ ని కూల్చాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఇప్పటం వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టైందన్న టాక్‌ వినిపిస్తోంది. నోటీసులు ఇవ్వడమే కాకుండా రోడ్లని కబ్జా చేసి కట్టిన ప్రహరీగోడలను మాత్రమే కూల్చామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన పలు ఫోటోలను మీడియా ముందు ఉంచింది.  అయినా కానీ విపక్షాలు ఈ మాటల్లో నిజం లేదని చెబుతూ ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పుతో నిజానిజాలేంటో బయటపడ్డాయని అధికారపార్టీ చెబుతోంది. ప్రజలను  తప్పుదోవపట్టించేందుకు విపక్షాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం వాటిని ఎదుర్కోంటూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తోందంటున్నారు. ఏది ఎలా ఉన్నా కానీ హైకోర్టు తీర్పు  పిటీషనర్లకే కాదు విపక్షాలకు కూడా గట్టి షాక్ ను ఇచ్చాయని వైసీపీ నేతలు అంటున్నారు.