Perni Nani On Kotamreddy :ఎమ్మెల్యేల మీద నిఘా ఉంటే ఆధారం ఉండాలి కదా అని మాజీ మంత్రి పేర్ని నాని  ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పింది కాల్ రికార్డింగ్ గురించేనని, అది ఫోన్ ట్యాపింగ్ కాదన్నారు.  కోటంరెడ్డి ఫోన్ వాట్సాప్ ఛాటింగ్ ను బయటపెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. బయట వైరల్ అవుతున్న ఆడియోను కోటంరెడ్డికి పంపి చెక్ చేసుకుకోమని ఇంటెలిజెన్స్ చీఫ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. కోటంరెడ్డి తన అంతరాత్మని ప్రశ్నించుకోవాలన్నారు. గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి బ్లూ కలర్ బెంజ్ కార్ వేసుకొని కోటంరెడ్డి వెళ్లారని ఆరోపించారు. అంతకు ముందు నుంచే కోటంరెడ్డి లోకేశ్ తో టచ్ లో ఉన్నారన్నారు.  సీఎం జగన్ కోటంరెడ్డి తన మనిషి అని విశ్వాసించారన్నారు. జగన్ పిచ్చి మారాజు, అందర్నీ నమ్మేస్తారన్నారు. ఒక చోట పనిచేస్తూ పక్క చూపులు చూస్తే ఎలా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు పక్షులు వలస వెళ్లే కాలం అన్నారు. కోటంరెడ్డి చేసింది కచ్చితంగా నమ్మకద్రోహమే అని పేర్ని నాని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగం సతీష్ చంద్ర చంద్రబాబు హయాంలో కూడా ఉన్నారన్నారు. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానంతో కాదని, పక్కా ప్లాన్ తో వచ్చిన మాటలు అన్నారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేసి వైరల్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.  


చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి 


"నేను రాజశేఖర్ రెడ్డిని అభిమానించాను. అందుకే జగన్ వెనుక నిలబడ్డాను. అభిమానిస్తే అవసరాల గురించి మాట్లాడం. పదవి ఇచ్చారా లేదా అని చూడం. కోటంరెడ్డి రాజకీయ అవసరాల కోసం ఆరోపమలు చేస్తున్నారు. పదవులు ఇవ్వలేదని అలిగితే అది రాజకీయ అవసరాలు. కోటంరెడ్డిని నారాయణతో టచ్ లో ఉండాలని చంద్రబాబు చెప్పారట. చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారు.  ఆడియో రికార్డింగ్ చూపించి ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. నాకు రోజు చాలా వస్తాయి. ఇదొక సాకు అంతే. ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం. కోటంరెడ్డిపై జగన్ ఇప్పటికీ ప్రేమ ఉంది. పార్టీ త్వరలో నెల్లూరు రూరల్ అభ్యర్థి ప్రకటిస్తుంది. దానికి తొందరేంలేదు. కోటంరెడ్డి రాజకీయ అవసరాల కోసమే ఆరోపణలు చేస్తున్నారు." - పేర్ని నాని 


నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ గా ఆదాల 


నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అధిష్టానం ఎక్కకేలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ఆయన పేరు ఖరారు చేసింది. గత మూడు రోజులుగా ఇన్ ఛార్జ్ విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. కోటంరెడ్డి బ్రదర్స్ ని గట్టిగా ఎదుర్కొని నిలబడేందుకు ఎవరైతే సరిపోతారా అనే విషయంలో అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు ఆదాలకు ఆ ప్లేస్ ఖరారు చేసింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారు. దీంతో ఆయన కూడా ఆ సీటుపై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారే హిస్టరీ ఉన్న ఆదాలపై వైసీపీ ఎంతవరకు నమ్మకం పెట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం కోటంరెడ్డి బ్రదర్స్ నెల్లూరు రూరల్ లో బలంగా పాతుకుపోయారు. పార్టీ కేడర్ తో పాటు, తటస్థులు, సామాన్య ప్రజల్లో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డికి మంచి పేరుంది. ఆ పేరుతోనే వారు పార్టీ ఏదయినా, తమ గెలుపు ఖాయమనుకుంటున్నారు. అందుకే 15 నెలల అధికారం ఉండి కూడా పార్టీని వదులుకుని బయటకు వస్తున్నారు. కోటంరెడ్డి బ్రదర్స్ ని ఢీకొట్టాలంటే, కేడర్ ని తమవైపు తిప్పుకోవాలంటే.. అది ఆదాలకే సాధ్యమవుతుందని భావిస్తోంది అధిష్టానం. అందుకే ఆయన పేరు ఖరారు చేసింది.