CM Jagan Review : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎన్నడూ లేని విధంగా  ప్రయత్నాలు చేశామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఎస్‌డీజీ(sustainable development goals)కు సంబంధించి ఇంత బాగా చేస్తున్నా , సమర్థవంతమైన రిపోర్టింగ్‌ కూడా అవసరం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రిపోర్టింగ్‌ మానిటరింగ్‌ అనేది సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పనిచేసినా లాభం లేదని సీఎం జగన్ అధికారుల‌కు సూచించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పోటీపడి దేశంలో తొలిస్థానంలో ఏపీ నిలిచిందన్నారు. 


ఏ రాష్ట్రంలోని లేని పథకాలు 


మరే రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు లేవని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. క్యాలెండర్‌ ప్రకారం మిస్‌ కాకుండా ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో ముందుగానే  ప్రకటిస్తున్నామన్నారు. డీబీటీ ద్వారా బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు పోతున్నాయన్నారు.  అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్‌ మోడ్‌లో ఈ పథకాలు అందిస్తున్నామన్నారు.  జిల్లాల్లో కలెక్టర్లు ఎస్‌డీజీ రిపోర్టును మానిటరింగ్‌ చేసే బాధ్యత తీసుకోవాలన్నారు.  ప్రతి నెలా ఎస్‌డీజీ రిపోర్టును కలెక్టర్‌ పర్యవేక్షణ చేయాలని సీఎం సూచించారు. సచివాలయం నుంచి డేటా జిల్లా స్థాయికి చేరాలన్నారు. విద్యా, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవ‌ని సీఎం జగన్ అన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ ఏపీ చేస్తున్న కృషి మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. 


క్యాలెండర్ ప్రకటించి ఇన్సెంటివ్ లు


ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి బటన్‌ నొక్కి ఎంఎస్‌ఎంఈలకు టైం ప్రకారం ఇన్సెంటివ్‌లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వ ఇన్సెంటివ్‌లకు సంబంధించిన బకాయిలు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ప్రతి రంగంలోనూ స్పష్టమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అమ్మఒడి, టీఎంఎప్, ఎస్‌ఎంఎఫ్‌లను సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదని సీఎం జగన్ అన్నారు.  సంపూర్ణపోషణ, గోరుముద్ద కూడా సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదన్నారు.  విద్యాకానుక, విద్యా దీవెన, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అంతకు ముందు ఎప్పుడూ జరగలేదన్నారు. ఆరోగ్యశ్రీలో దాదాపు 3 వేల చికిత్సా విధానాలు, 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో ఆసుపత్రుల పునర్‌వ్యవస్ధీకరణ, ఆరోగ్య ఆసరా ఇవేవీ ఇంతకు ముందులేవన్నారు. 


ఒక్క బటన్ నొక్కి 


ఒక్క బటన్‌ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిందని సీఎం  జగన్ తెలిపారు. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం ఏ రాష్ట్రం అమలుచేయడంలేదన్నారు. ఎస్‌డీజీకి సంబధించి కచ్చితంగా ఎస్‌ఓపీలు ఉండాలని, వాటిని నిరంతరం పాటించాలని సీఎం ఆదేశిచారు. విద్యాశాఖలో నూటికి నూరుశాతం ఎస్‌డీజీ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతినెలా సీఎస్‌ ఆధ్వర్యంలో రెండుదఫాలుగా సమావేశం కావాలని, మూడు నెలలపాటు ఇలా సమావేశమవ్వాలని సీఎం  జగన్ ఆదేశించారు.