సన్నిహితులకు పంచి పెడితే పాపం..


ఉచిత హామీల (Revadi)వల్ల దేశానికి ఎంతో చేటు జరుగుతుందని, రాజకీయాల్లో ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ ఈ కామెంట్స్‌పై సెటైర్లు వేయగా...ఇప్పుడు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. సన్నిహితులకు, కావాల్సిన వాళ్లకు ఉచిత హామీలు ఇవ్వటం "పాపం" అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు. హరియాణాలో రేవాడి స్వీట్లు చాలా ఫేమస్. అక్కడ ఏ వేడుక జరిగినా అందరికీ ఈ స్వీట్లను పంచుతారు. అందుకే ప్రధాని మోదీ దీన్ని ఉద్దేశిస్తూ కొన్ని హామీలను అలా "రేవాడి"లా పంచుతున్నారని అన్నారు. అంటే మిఠాయిల్లా పంచి పెడుతున్నారని కాస్త సెటైరికల్‌గా చెప్పారు. ఇప్పుడిదే అంశాన్ని కోట్ చేస్తూ...కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. "కొందరు రేవాడి గురించి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఈ స్వీట్లు పంచి పెడితే దాన్ని ప్రసాదం అంటారు. కానీ...అవే స్వీట్లను సన్నిహితులకు, మంత్రులకు పంచి పెడితే దాన్ని పాపం అంటారు" అని అన్నారు కేజ్రీవాల్.





 


గుజరాత్‌ ప్రజలపై కేంద్రానికి ఎందుకంత కోపం..? 


ఈ సమయంలోనే గుజరాత్ ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఆప్ అధికారంలోకి వస్తే 24 గంటల పాటు విద్యుత్ అందిస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ  నిరంతరాయ విద్యుత్‌ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. గుజరాత్‌లో రెండు నెలలకోసారి కరెంట్ బిల్ వస్తుంది. నెలకు 300 యూనిట్ల చొప్పున రెండు నెలలకు 600 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు కేజ్రీవాల్. 2021 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న పెండింగ్ కరెంట్ బిల్స్‌ను పూర్తిగా మాఫీ చేస్తామని వెల్లడించారు. "నేను మాటిస్తున్నాను. నేను ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా, తరవాత ఆప్‌ పార్టీకి అసలు ఓటు వేయకండి. ఓసారి అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేర్చి తీరుతాం" అని అన్నారు. కేంద్రం గుజరాత్ ప్రజల్ని శత్రువుల్లా ఎందుకు చూస్తోందో అర్థం కావట్లేదని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా 125 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తోంది. బెంగాల్‌లో అమిత్‌షా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో మాత్రం "ఉచిత హామీలతో ప్రమాదం" అని అనటం వింతగా ఉందని మండిపడ్డారు. "ఎన్నికల స్టంట్‌" పై తమకు ఎలాంటి నమ్మకం లేదన్న కేజ్రీవాల్, కొన్ని పార్టీలు ఎన్నికల ముందు మాత్రమే సంకల్ప యాత్ర అని హడావుడి చేసి తరవాత ప్రజల్ని మర్చిపోతాయని విమర్శించారు. తమ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. 


Also Read: Manoj Bajpayee: ఎవరు చెప్పారు మీకు? 'పుష్ప'లో పాత్రపై 'ఫ్యామిలీ మ్యాన్' స్పందన ఇది!