CM Jagan Review : పోలవరం సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారంత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రభావం, తలెత్తిన పరిణామాలపై అధికారులను ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గ్యాప్‌–1, గ్యాప్‌–2లు పూడ్చే పనులపై సీఎం సమీక్షించారు. రెండు గ్యాప్‌లను పూడ్చే పనులకు గాను 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.  అయితే వీటిల్లో ఇప్పటికే కొన్ని  పూర్తయ్యాయని, మిగిలినవి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ టెస్టులు పూర్తికాక ముందే గోదావరికి వరద రావడంతో దిగువ కాపర్‌ డ్యాం ఏరియాలో నీరు చేరిందని అధికారులు వివరణ ఇచ్చారు.  వరదలు తగ్గాక ఈ టెస్టులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.  


కాపర్ డ్యాం పనులకు అంతరాయం 
 
ఎగువ నుంచి భారీ వరద రావడంతో దిగువ కాపర్‌డ్యాం పనులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాపర్‌ డ్యాం పనులు తిరిగి ప్రారంభించడానికి అవకాశం లేదని సీఎంకు వివరించారు.  వరదలు తగ్గితే ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వరద తగ్గగానే ముమ్మరంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు  కేంద్రం నుంచి రావాల్సిన రీయంబర్స్ మెంట్ నిధులు రూ.2,900 కోట్లని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా అడహాక్‌ రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం కుడి, ఎడమ కాల్వల హెడ్‌ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.


నెల్లూరు, సంగం బ్యారేజీలపై 


నెల్లూరు, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీలపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ బ్యారేజీలను ఆగస్టులో ప్రారంభించాలని  సీఎం నిర్ణయించారు. మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, దానిని బ్యారేజీ వద్ద పెట్టేందుకు చర్యలు చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. దసరా నాటికి వెలిగొండ టన్నెల్‌ 2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో 137.5 మీటర్ల పనులు చేశామని అధికారులు  ముఖ్యమంత్రికి వివరించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.  వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనులు దాదాపుగా పూర్తయ్యాయని అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


ఇతర ప్రాజెక్టులపై 


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి, రాజోలిబండ, వేదవతి, కుందూ లిఫ్ట్,  ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు, చింతలపూడి, వైఎస్సార్‌ పల్నాడు, మడకశిర బైపాస్‌ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి మొత్తం 27 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 


 సీఎం జగన్ ఏరియల్ సర్వే 


గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో  సీఎం జగన్‌ రేపు(జులై 15న) ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్‌ సర్వేకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇవాళ గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి సీఎం జగన్ వివరాల అడిగి తెలుసుకున్నారు. రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు.  తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌ సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు  అధికారులు వివరించారు. దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందన్నారు.  దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.  వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.