Good Luck Jerry: జాన్వీకపూర్ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు ‘గుడ్ లక్ జెర్రీ’. ఈ సినిమా పూర్తి ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీన్ని చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. అలాగే జాన్వీ నటనకు కూడా ఫిదా అయిపోతారు. బీహార్లోని పేద ఇంటి యువతిగా ఇందులో కనిపించింది జాన్వీ. అసలు జయ కుమారి కాగా, డ్రగ్స్ దందాలో చేరి జెర్రీగా పేరు మార్చుకుంటుంది. ఆమె డ్రగ్స్ అమ్మేందుకు ఎంత కష్టపడింది? ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అంతా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. క్రైమ్ నేపథ్యంలో సాగిన కామెడీ మూవీలా ఉంది ఈ సినిమా. ట్రైలర్ ను బట్టి జెర్రీ తల్లికి ఊపిరితిత్తుల క్యాన్సర్. ఆమెను కాపాడుకునేందుకు ఏ పని చేయడానికైనా సిద్ధపడుతుంది జాన్వీ. అలా ఓ డ్రగ్ మాఫియా టీమ్ లో చేరుతుంది. పోలీసుల నుంచి తప్పించుకుని డ్రగ్స్ అమ్మడం మొదలుపెడుతుంది.
ఈ సినిమా గురించి ట్రైలర్లో తెలిసేది కొంతే. ట్రైలర్ మాత్రం ఆసక్తిగా, కామెడీగా ఉంది. జాన్వీ తుపాకితో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి డ్రగ్స్ రాకెట్లో ఎలా చేరిందో, ఏ స్థాయికి వెళ్లిందో చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాను తమిళంలో తీసిన ‘కొలమావు కోకిల’ అనే సినిమా ఆధారంగా తీసినట్టు మూవీ మేకర్స్ ముందే చెప్పారు. ఆ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. అదే పాత్రను హిందీలో జాన్వీ చేసింది.
ప్రస్తుతం జాన్వీ యూరోప్ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే ఆమె రాజ్ కుమార్ రావ్‌తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కూడా నటించబోతోంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి రూహి సినిమాలో జంటగా కనిపించారు.