CM Jagan Review : వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్ పైలెట్ ప్రాజెక్టుపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులు 26 జిల్లాల్లో నెల రోజుల వ్యవధిలో 7166 విలేజ్ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున, 2866 విలేజ్ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్ 104 వాహనాల్లో వెళ్లారని సీఎం జగన్ కు తెలిపారు. డిసెంబర్‌లో మరో 260... 104 వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత పెరిగాయని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపై పరిశీలన చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రక్త హీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి బాధితులకు చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నెల రోజుల వ్యవధిలో 7,86,226 మందికి వైద్య సేవలందించామని పేర్కొన్నారు. బీపీతో బాధపడుతున్న 1,78,387 మందిని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న 1,25,948 మందిని గుర్తించినట్టు చెప్పారు. వీరికి వైద్యసాయం అందించినట్టు సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు.
ఉగాదికి విలేజ్ క్లినిక్స్
రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో క్రమం తప్పకుండా మందులు ఇవ్వాలని, రోగులకు సూచనలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తిచేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది కల్లా వీటిని పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. పిల్లలు, గర్భవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ సమాచారన్ని స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలన్నారు. ఈ డేటా ఆధారంగా వారికి పౌష్టికాహారం, మందులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాల కోసం యాప్
"ఆరోగ్యశ్రీపై ప్రజలకు మరింత అవగాహన కలిగించాలి. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందో బాధితులకు తెలియజేయాలి. ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలంటే సంబంధిత చికిత్సను అందించే నెట్‌వర్క్ ఆసుపత్రి వివరాలు తెలిసేలా ఒక యాప్‌ను రూపొందించాలి. సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్ కూడా చూపేలా యాప్ ఉండాలి. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలు ప్రజలకు గైడ్ చేసేలా ఉండాలి. ప్రజలకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉండాలి. ఆరోగ్య శ్రీ సాప్ట్‌వేర్ ను కూడా మరింతగా మెరుగుపర్చాలి. ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు రియల్‌టైం డేటా రికార్డు చేసుకోవాలి. దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి. " - సీఎం జగన్