ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) హీరోగా నటించిన చిత్రం 'టాప్ గేర్' (Top Gear Movie). ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. శశికాంత్ దర్శకత్వం వహించారు.
మారుతి చేతుల మీదుగా టీజర్!
డిసెంబర్ 3న... అనగా ఈ శనివారం ఉదయం పదకొండు గంటలకు 'టాప్ గేర్' టీజర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది. 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్‌లో ఆది సాయి కుమార్ గన్ పట్టుకుని ఉన్నారు.
టాక్సీ డ్రైవర్ గన్ ఎందుకు పట్టాడు?
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్' డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. మరి, టాక్సీ డ్రైవర్ గన్ ఎందుకు పట్టుకున్నాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టీజర్‌లో ఆ విషయం వెల్లడిస్తారేమో!? చూడాలి.
Also Read : 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా
''అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు .
వెన్నెల... వెన్నెల... పెళ్లి తర్వాత పాట!
'టాప్ గేర్' చిత్రంలో ఆది సాయి కుమార్‌కు జంటగా రియా సుమన్ (Riya Suman) నటించారు. కథలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ సమయంలో వచ్చే 'వెన్నెల వెన్నెల...' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మధ్య ఆ పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆయన బాణీకి సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ సూపర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సైతం బావుందని చెబుతున్నారు.
'జులాయి', 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి తమ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని కేవీ శశ్రీధర్ చెప్పారు. శ్రీవిష్ణు 'అల్లూరి', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' తదితర చిత్రాలకు పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.