Adoni MLA On Jagan :  ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని దీనికి కారణం జగన్‌కు అనుభవం లేకపోవడమేనన్నారు. ఎమ్మెల్యేలతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదంటున్నారు. అయితే రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అరేకల్లులో ఇంటింటికి తిరుగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి. దీంతో ఆయన పక్కనే ఉన్న సొంతపార్టీ నేతలు అవాక్కయ్యారు.             


సాయిప్రసాద్ రెడ్డి కామెంట్లపై వైఎస్ఆర్‌సీపీలో  అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా అన్నారా లేకపోతే తన అభిప్రాయాన్ని అలా చెప్పారా అన్న దానిపై హైకమాండ్ సన్నిహితులు ఆరా తీస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఆ సమయంలోనే ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని గుర్తించి వారితో సీఎం  జగన్ ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కానీ వారిలో అసంతృప్తి తగ్గలేదని చెబుతున్నారు.                                  


మరో వైపు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్‌సీపీతో మైండ్ గేమ్ ఆడుతోంది. తమతో నలభై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే వాటిని కొట్టి  పారేయలేమన్న వాతావరణం ఉండటంతో సాయి ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ఉండాలని అనుకుంటున్నారు. గతంలో ఇదే విషయాన్ని  నేరుగా చెప్పి  తనకు ఎంత సన్నిహితులైనా సర్వేల్లో బాగా లేకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదని ప్రకటించేవారు.                           


అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం జగన్ స్వరంలో మార్పు వచ్చింది. ఎవర్నీ వదులుకోనని అందర్నీ గెలిపించుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేకపోతే మరో విధంగా న్యాయం చేస్తానన్నారు. అయితే  రాజకీయ నాయకులు తమ ఎమ్మెల్యే టిక్కెట్లకు ఎసరు పెడితే వేరే పార్టీలో చూసుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా  ఎక్కువ మందిఅదే పని చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ పాలన సరిగ్గా చేయలేకపోయారని.. దానికి అనుభవం లేకపోవడమే కారణమని చెబుతూండటం ఆసక్తి రేపుతోంది.