Adani Group Donation To AP Flood Relief: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి (CMRF) తమ వంతు విరాళం అందిస్తున్నారు. తాజాగా, వరదలతో అల్లాడిన ఏపీకి సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautham Adani) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు.
మరోవైపు, సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ తరఫున రూ.50 లక్షలను సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే, ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి సేకరించిన రూ.35 లక్షలను సీఎంకు అందజేశారు. వరద బాధితుల కోసం గుంటూరుకు చెందిన గడ్డిపాటి సుధాకర్ దంపతులు రూ.20 లక్షలు, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు రూ.10 లక్షలు, 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు, మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున రూ.6 లక్షలు, మల్లవల్లి ఇండస్ట్రీస్ రూ.14.50 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ తరఫున రూ.50 లక్షలు, రాజమండ్రి రూరల్ ప్రజలు అందించిన దాదాపు రూ.83 లక్షల చెక్కును ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు అందజేశారు.