Posani Kishna Murali: ఏపీలో కాపు చుట్టూ రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాపు నేత ముద్రగడపై విమర్శలు చేయడంతో అది మరింత ముదిరింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ వర్సెస్ కాపు నేత ముద్రగడ అన్నట్లుగా మారిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయ కాక రేపుతున్నారు. అలాగే వీరి ఫ్యాన్స్, జనసేన, ముద్రగడ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై ముద్రగడ కూడా వెనక్కి తగ్గకుండా సై అంటున్నారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ముద్రగడ సవాల్ చేసిన విషయం తెలిసిందే.


తాజాగా ముద్రగడకు మద్దతుగా, సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ముద్రగడ పద్మనాభం గొప్ప నాయకుడు అని, ఆయన ఎప్పుడూ రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసం వెంపర్లాడలేదని మద్దతుగా నిలిచారు. కాపుల కోసం, కాపు ఉద్యమం కోసం, కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ల కోసం డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, చివరికి మంత్రి పదవిని కూడా పక్కకి తన్నేశాడని పోసాని అన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే కాపుల్లో చిచ్చు రేగుతోందని పోసాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడటం ఏమిటని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ అలాగే నడుస్తున్నారని ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో కూడా తెలియదని పోసాని ఎద్దేవా చేశారు. పవన్ కన్నా ముద్రగడ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ముద్రగడ పద్మనాభంకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబేనని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


'రాజీనామా లేఖను ముఖాన కొట్టాడు'


' పవన్ కళ్యాణ్ గారూ మీకు తెలియకపోవచ్చేమో.. అది 80వ దశకం నాటి సంగతి. నాడు ఎన్టీఆర్ హయాంలో ముద్రగడ పద్మనాభం మంత్రిగా పని చేశారు. అయితే తన శాఖలో ఎన్టీఆర్ జోక్యం చేసుకోవడంతో వద్దని ఆయన చెప్పాడు. కానీ ఎన్టీఆర్ మళ్లీ మళ్లీ ముద్రగడకు కేటాయించిన శాఖలో జోక్యం చేసుకున్నాడు. దాంతో ముద్రగడ పద్మనాభం ఏం చేశాడో తెలుసా? రాజీనామా లేఖ రాసి ఎన్టీఆర్ ముఖాన కొట్టాడు. రైలెక్కి నేరుగా కిర్లంపూడి వచ్చేశాడు. అదే.. నువ్వు ప్రేమించే చంద్రబాబు ఏం చేశాడో తెలుసా పవన్ కళ్యాణ్? వేరే పార్టీ నుంచి వచ్చి రామారావు కాళ్లు పట్టుకుని, లక్ష్మీ పార్వతి కాళ్లు పట్టుకుని వేచి చూసి వేచి చూసి ఎన్టీఆర్ ను ఒక్క గుద్దు గుద్ది, వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడు' అని పోసాని పేర్కొన్నారు. 


Also Read: Mudragada Vs budda : చంద్రబాబు జోలికి రాకు - ముద్రగడకు బుద్దావెంకన్న వార్నింగ్


ముద్రగడ 1981 నుంచి కాపుల కోసం పోరాడుతున్నారని, ఆయన తన ఉద్యమంలో ఒక్క రూపాయి తిన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వెళ్లిపోతానని పోసాని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే నువ్వు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు.. నేరుగా ముద్రగడ వద్దకు వెళ్లి నిజం తెలుసుకున్నానని చెప్పి క్షమాపణ అడుగు అని పోసాని సలహా ఇచ్చారు. అలా చేస్తే నువ్వు నిజంగానే చాలా గొప్పవాడివి అవుతావు అని పోసాని వ్యాఖ్యానించారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial