Mudragada Vs budda : పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ.. చంద్రబాబు ప్రస్తావన కూడా లేఖలో చేసిన ముద్రగడ పద్మనాభంకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి కౌంటర్ ఇచ్చారు. ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? అని ప్రశ్నించారు. 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 – 1994లో ఎలా కలుస్తారు? ‘ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా? అంటూ సెటైర్ వేశారు. 1993 – 1994 లో పత్తిపాడు ఎం.ఎల్.ఏ గా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి వున్నారు..మీరు చెప్తున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా వున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరిచిపోయారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ముద్రగడ ప్రతి లేఖకూ కౌంటర్ ఇస్తానన్న బుద్దా వెంకన్న
అప్పటి విషయం చంద్రబాబు గారికి ఆపాదించడం పొరపాటు కాదా?మీరు ఈ లేఖలతో ఎందుకు జరగని విషయాలను జరిగినట్టు ప్రస్తావిస్తున్నారు?ఎందుకు మీరు చంద్రబాబుని ప్రతివిషయంలో లాగుతారు?అంటూ ప్రశ్నించారు.రాజకీయంగా ఏదన్నా మాట్లాడండి తప్పు లేదు.. కానీ చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించకండి.. ఆయన అన్ని కులాలని సమానంగా చూస్తారు అంటూ పేర్కొన్నారు. ముద్రగడ రాసే ప్రతీ లేఖలు సమాధానం ఇస్తామంటూ బుద్ధా వెంకన్న కొన్ని రోజుల క్రితం ముద్రగడకు కౌంటర్ ఇచ్చిన సందర్భంగా తెలిపారు. ముద్రగడ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి అంటూ మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో బుద్దా వెంకన్న ఆయనకు మరోసారి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు.
పవన్ కు సవాల్ చేస్తూ ముద్రగడ లేఖ
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ చేసినట్టు పోటీకి సిద్ధం కావాలని పవన్‌కు ముద్రగడ పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చారు. ఏ కారణంతోనైనా అక్కడ చేయబోనని తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడాలన్నారు. అలా సిద్దపడిన తర్వాత తనకు సవాల్ చేస్తే తాను రెడీ అవుతారని చెప్పుకొచ్చారు ముద్రగడ. ఈ మేరకు పలు ఆరోపణలతో పవన్ పై మళ్లీ లేఖ రాశారు. చేగువేరా ఆదర్శం అంటూ చెప్పుకునే పవన్ కల్యాణ్... గుండెల నిండా దైర్యం ఉంటే రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. జనసైనికులు బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టినంత మాత్రాన తాను భయపడి పోయి లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. డోంట్ కేర్ అంటూ... ఎప్పటికీ మీ మోచేతి కింద నీళ్ళు తాగడం లేదని తాగబోనని చెప్పారు.
కులాన్ని తాకట్టు పెట్టేసినట్లుగా విమర్శిస్తున్నారన్న ముద్రగడ
ఎప్పుడూ తాను పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని అయినా తనను కాకినాడ ఎమ్మెల్యేలను తిట్టిపోశారని విమర్శించారు ముద్రగడ. అలా ఫ్యాన్స్‌తో తిట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నరాని... సినిమాల్లోనే హీరో తప్ప రాజకీయాల్లో కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. కులం కోసం తాను ఏమీ చేయనట్టు కులాన్ని ఉపయోగించుకొని ఎదిగినట్టు ఉద్యమాన్ని అమ్మేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఇవి సినిమా డైలాగ్‌లను మరిపించిందన్నారు. గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదన్నారు. దమ్ముధైర్యం ఉంటే నేరుగా తన పేరును ఉపయోగించి మీరే తిట్టాలని పవన్‌కు సవాల్ చేశారు. దానికి తాను సమాధానం చెబుతానన్నారు. కాపుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయని పవన్ కాపుల గురించి మాట్లాడే హక్కులేదని విమర్శించారు.