Man Tried To Jump Into The River In Rajamundry: తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో మంగళవారం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ (Ysrcp Leader Jagan) ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా గోదావరిలో దూకేందుకు యత్నించాడు. ఈ ఘటన రాజమండ్రిలో కొవ్వూరు (Kovvuru) గామన్ బ్రిడ్జి వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణగూడెంకు చెందిన వ్యక్తి మంగళవారం ఉదయం కొవ్వూరు గామన్ వంతెనపైకి ఫ్యామిలీతో సహా వచ్చి గోదావరిలో దూకుతానని హల్చల్ చేశాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించాడు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.


వంతెనపై నానా హంగామా


జగన్ తనకు చాలా సాయం చేశారని.. ఈరోజు తాను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు జగనే కారణమని అన్నాడు. తాము వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయంటూ నిలదీశాడు. ఓటమి పాలైన జగన్‌ను తాను చూడలేక భార్య, పిల్లలతో గోదావరిలో దూకుతానంటూ నానా హంగామా చేశాడు. ఈ సందర్భంగా వంతెనపై వైసీపీ జెండా ఎగురవేశాడు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడు. పోలీసులు వస్తే గోదావరిలో దూకేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని వారించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.